అనేక యుద్ధాల ఆరితేరిన యోధుడెవ్వడు?
విజయాన్ని దీటుగా ముద్దాడిన వీరుడెవ్వడు?
కాంగ్రెస్ పోడగొట్టిన తెలంగాణను,
చాణక్యంతో తిరిగి తెచ్చిన ధీరుడెవ్వడు?
తెచ్చిన తెలంగాణను దేశం మెచ్చినట్టు
చేసిన చతురుడెవ్వడు?
వరుస ఎన్నికల్లో తెలంగాణను
గెలిపించిన విజయుడెవ్వడు?
తెలంగాణలో అణువణువూ తెలిసిన
ఏకైక నాయకుడెవ్వడు?
ప్రతి కణమూ తెలంగాణ కోసమే
తపించే ప్రేమగల్ల మనిషెవ్వడు?
చేసేది మాత్రమే కాదు;
చేసింది చెప్పి ఓట్లడిగే
దమ్మున్న లీడరెవ్వడు?
హామీలను కాదు;
అభివృద్ధిని చూపి ఆశీర్వాదం
కోరే పరిపాలకుడెవ్వడు?
ప్రగతిని, సంక్షేమాన్ని
జోడెడ్లుగ నడిపిన
దక్షుడెవ్వడు?
పాలన చేతకాదన్నవారి
కండ్ల ముందే, ఏకబిగిన
సుదీర్ఘ కాలం పరిపాలించిన
తెలుగు ముఖ్యమంత్రిగా రికార్డు
సృష్టించిన దార్శనికుడెవ్వడు?
యావత్ దక్షిణాదిలోనే
ఏకబిగిన సుదీర్ఘకాలం
అధికారంలో ఉన్న సీఎంగా
ఘనత సాధించబోతున్నదెవ్వడు?
కేసీఆర్ కంటే
తెలంగాణను ఎక్కువగా
ప్రేమించే నాయకుడెవ్వడు?
ఒకే ఒక్కడు!
ఆ ఒకే ఒక్కడు కేసీఆర్!!
అహింసాయుత ఉద్యమంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా దాన్ని ప్రగతి పథాన నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన తెలంగాణ ప్రేమికుడు.. పాలకుడు..ఒకే ఒక్కడు.. KCR
దక్షిణాది రాష్ర్టాల నుంచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయ్యే అరుదైన రికార్డుకు అతి చేరువలో కేసీఆర్ ఉన్నారు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్‌కు ప్రతిఫలంగా మనం హ్యాట్రిక్ సీఎం అనే చిరుకానుక ఇవ్వలేమా? ఒక్కసారి ప్రతిఒక్కరు మనసు పెట్టి ఆలోచించాలి. ఈ సందర్భంగా చరిత్రలో ఒక ఘటనను గుర్తు చేసుకుంటే అంతకంటే స్ఫూర్తి మరొకటి ఉండదు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావుకు తొలిసారి దక్షిణాది నుంచి దేశ ప్రధానిగా అవకాశం లభించింది. అప్పట్లో జాతీయ స్థాయిలో విపక్ష కూటమి అయిన నేషనల్ ఫ్రంట్‌కు చైర్మన్‌గా ఎన్టీఆర్ ఉన్నారు. ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు నంద్యాల నుంచి లోక్‌సభ బరిలో నిలిచారు. దేశ ప్రధానిగా తొలిసారి ఒక దక్షిణాది వ్యక్తి, ముఖ్యంగా తెలుగుబిడ్డ ఉన్నాడన్న గౌరవంతో గర్వంతో ఎన్టీఆర్ ఎంతో సంబురపడ్డారు. పీవీ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగినప్పటికీ ఆయనపై టీడీపీ పోటీ పెట్టడం లేదని ఎన్టీఆర్ ఆదరాభిమానాలతో ప్రకటించారు. తెలుగువాడైన పీవీ పట్ల ఎన్టీఆర్ అంత అభిమానం చూపిస్తే, తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చి.. దేశంమెచ్చేలా తీర్చిదిద్దిన కేసీఆర్ పట్ల మనకెంత అభిమానం ఉండాలి?
ఇది మనందరి కలల పంట తెలంగాణను పండించిన కేసీఆర్‌ను నిండుగ ఆశీర్వదించాల్సిన సమయం.ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచించి, సగర్వంగా నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం.
వియ్యానికైనా, కయ్యానికైనా సమఉజ్జీలు ఉండాలంటారు. మరి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమరాంగణంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు సరితూగగల రాజకీయ ప్రత్యర్థి ఎవరు? కేసీఆర్ స్ట్రేచర్కు సరితూగే రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్‌లోగానీ, బీజేపీలోగానీ ఎవరున్నారు? ప్రజలు తమ పాలకుడిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు బరిలో ఉన్నవారిలో పాలనా దక్షత, విజన్, చిత్తశుద్ధిని బేరీజు వేసుకుంటారు. అలా చూసినప్పుడు సీఎం కేసీఆర్ స్ట్రేచర్కు సరితూగే నాయకుడు కాంగ్రెస్, బీజేపీలో ఎవరున్నారని భూతద్దం పెట్టుకొని వెదికినా దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించరు.
-వెల్జాల చంద్రశేఖర్ (స్పెషల్ టాస్క్ బ్యూరో)
CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌కు 45 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నది. చట్టసభల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా 38 ఏండ్ల అపార అనుభవం ఆయన సొంతం. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకొంటున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వయసులే కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేవు. సిద్దిపేట నుంచి 1983లో కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రేవంత్‌రెడ్డి వయసు 14 ఏండ్లు (1969లో జన్మించారు). అప్పటికి ఆయన పదోతరగతి చవటంలేదు. కిషన్‌రెడ్డికి అప్పుడు 19 ఏండ్లు (1964 జన్మించారు). కేసీఆర్ యూత్‌కాంగ్రెస్ నేతగా ఊపుమీదున్నప్పుడు వీరిద్దరూ ఊహ కూడా తెలియని చిన్నపిల్లలు. ఏకబిగిన సుదీర్ఘకాలం తెలుగు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా సీఎం కేసీఆర్‌దే.
2014 జూన్ 2న తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. నేటికి అంటే 15-10-2023 నాటికి ఏకబిగిన 9 ఏండ్ల 134 రోజులుగా సీఎంగా కొనసాగుతున్నారు. అవాంతరాలు లేకుండా ఇంత సుదీర్ఘంగా సీఎంగా కొనసాగిన తెలుగు నేత మరెవరూ లేరు.
కేసీఆర్ మరో రికార్డు కూడా చేరువలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ద్వారా దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు సీఎం అయిన వ్యక్తిగా నిలిచేందుకు కొద్దిదూరంలోనే ఉన్నారు. సమకాలీన భారతదేశ రాజకీయ రంగంలో కేసీఆర్‌కు ఉన్న ఘనతలు మరెవరికీ లేవు. స్వయంగా ఒక ఉద్యమ పార్టీని స్థాపించి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. సాధించుకున్న రాష్ర్టానికి తొమ్మిదిన్నరేండ్లుగా ముఖ్యమంత్రిగా, 22 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఏడాది కిందట బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ అధినేతగా, సీఎంగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఇప్పుడు ఒక కీలక నాయకుడు. ప్రధాని పదవికి పోటీపడే నాయకుల్లో కేసీఆర్ ఒకరని జాతీయ మీడియా, దేశ ప్రజలు భావిస్తున్నారు.
ఆ స్ట్రేచరే వేరు
ప్రధాని మోదీ మొదలుకొని, వివిధ రాష్ర్టాల సీఎంలలో ఎవరికీ లేని ఒక అరుదైన ఖ్యాతిని కేసీఆర్ సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక ఉద్యమ పార్టీని స్థాపించి రాష్ర్టాన్ని సాధించిన చరిత్ర సమకాలీన నేతల్లో ఎవరికీ లేదు. కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడం వరకే పరిమితం కాలేదు. సాధించిన రాష్ర్టాన్ని దేశంలోనే ఒక రోల్‌మాడల్‌గా తీర్చిదిద్దారు. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో దక్షిణాదివారిని మద్రాసీలు అని పిలిచేవారు. ఆ తర్వాత దివంగత ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటాక ఆంధ్రవాలే అనేవారు. ఇప్పుడు కేసీఆర్వల్ల తెలంగాణే వాలే అంటున్నారు. ఇది కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపునకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ఇక్కడ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికి రోల్‌మాడల్‌గా మారాయి. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనం. ప్రధాని మోదీ స్వయంగా పలు సందర్భాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలను తెలంగాణకు వెళ్లి ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి రావాలని సూచించారు.
కేంద్ర బృందాలు, ఇతర రాష్ర్టాల బృందాలు తెలంగాణకు ఇప్పటికీ వచ్చి నీటిపారుదల ప్రాజెక్టులను, పథకాలను అధ్యయనం చేసి వెళ్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతలను కొనియాడని అంతర్జాతీయ సంస్థలు, మీడియా సంస్థలు లేవంటే అతిశయోక్తి కాదు. దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్నప్పుడు వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకొని కుదేలైనాయి. కానీ, వ్యవసాయం దండుగ అన్న గత పాలకుల కండ్లు తెరిపించేలా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో సాగును పండుగగా తీర్చిదిద్దిన రైతు పక్షపాతిగా కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. కాంగ్రెస్, బీజేపీ దళిత జనోద్ధరణ జపం చేయడమేకాని ఆ దిశగా ఏనాడూ చిత్తశుద్ధితో పనిచేయలేదు. కలలో కూడా ఉహించని, ఆలోచించని విప్లవవాత్మక దళితబంధు పథకానికి రూపకల్పన చేసి ప్రవేశపెట్టింది కేసీఆరే. దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో ప్రతిష్టించి దళిత సంఘాలు, నాయకుల నుంచి అభినవ అంబేద్కర్గా కితాబు అందుకున్నది మన సీఎం కేసీఆరే.
కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రేమించే వారు ఎవరున్నారు?
సీఎం కేసీఆర్ కంటే తెలంగాణను ఎక్కువగా ప్రేమించే నాయకుడు ఎవరున్నారు? కేసీఆర్ అంటే గిట్టని రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదనలేని అక్షర సత్యం ఇది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, ప్రజలు ఎదుర్కొన్న కడగండ్లు, కన్నీళ్లు చూసి భరించలేక తన రాజకీయ భవిష్యత్తును సైతం పణంగా పెట్టి, చట్టసభల్లో పదవులను తృణప్రాయంగా త్యజించిన అరుదైన నాయకుడు కేసీఆర్. రాష్ట్ర సాధన ఒక్కటే తెలంగాణ కష్టాలకు పరిష్కారమని నమ్మి, ప్రజలను ఒప్పించి, ఉద్యమంలో భాగస్వాములను చేశారు. దాదాపు దశాబ్దన్నర కాలం అనేక కష్టనష్టాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలను భరించి ఎట్టకేలకూ తను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ధీరోదాత్తుడు. ఒక ప్రాంత ప్రజల విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసి నిలిచి గెలిచిన కేసీఆర్ స్ట్రేచర్కు సరితూగే రాజకీయ నేత ఇంకేపార్టీల్లో అయినా ఉన్నారా? తెలంగాణకు అదిచేస్తాం.. ఇది చేస్తాం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ గురించి కూడా కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
తల్లి పుట్టిల్లు మేనమామకు ఎరుక అన్నట్టు, యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటి నుంచీ దాదాపు 50 ఏండ్లుగా కాంగ్రెస్ తీరును ఆయన గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు ఆహోరాత్రులు ఆలోచించి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేసిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది కేసీఆర్ కాదా? రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ఎట్లుండె? ఇప్పుడెంట్లున్నదో అర్థం కావడం లేదా? తలసరి ఆదాయంలో తెలంగాణ ఇప్పుడు దేశంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది అంటే అది సీఎం కేసీఆర్ కృషికి, చిత్తశుద్ధికి నిదర్శనం కాదా? ఏ కోణంలో చూసినా వర్తమాన రాజకీయాల్లో కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు ఉన్నారా? తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ పట్ల ఉన్నంత అభిమానం, పాఫులారిటీ ఇంకే నాయకుడికైనా ఉన్నదా?
ప్రతిఫలంగా ఏమిద్దాం?
సీఎంగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసేందుకు కేసీఆర్ చేరువలో ఉన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్‌కు ప్రతిఫలంగా దక్షిణాది నుంచి హ్యాట్రిక్ సాధించిన తొలి సీఎంగా నిలిపి చిరుకానుకగా ఇవ్వలేమా? ప్రతిఒక్కరూ మనసు పెట్టి ఆలోచించాలి. ఈ సందర్భంగా చరిత్రలో ఒక ఘటనను గుర్తు చేసుకుంటే అంతకంటే స్ఫూర్తి మరొకటి ఉండదు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్షిణాది నుంచి తొలి ప్రధానిగాఅవకాశం లభించింది.
అప్పట్లో జాతీయస్థాయిలో విపక్ష కూటమి అయిన నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీఆర్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రధాని హోదాలో పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ప్రధానిగా తొలిసారి ఒక దక్షిణాది వ్యక్తికి, ముఖ్యంగా తెలుగుబిడ్డకు ఈ అవకాశం దక్కడంతో ఒక తెలుగువాడిగా గర్వపడుతూ నంద్యాలలో పీవీపై టీడీపీ పోటీకి అభ్యర్థిని పెట్టడంలేదని ఎన్టీఆర్ ప్రకటించారు. తెలుగువాడిగా పీవీ పట్ల ఎన్టీఆర్కే అంత అభిమానం ఉంటే, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిపెట్టిన కేసీఆర్ పట్ల మనకేంత అభిమానం ఉండాలి? ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం.