హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): పరిపాలనలో తుగ్లక్‌ను తలదన్నేలా సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. హైకోర్టు కల్పించుకోకముందే హైడ్రా పేరిట ప్రజల ఇండ్లు కూల్చివేయవద్దనే సోయి ఎందుకు రాలేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్వే చేయకుండానే ప్రజల ఇండ్లు కూల్చి సీఎం రేవంత్‌రెడ్డి ఘోర తప్పిదం చేశారని ఆరోపించారు. హైడ్రా బెదిరింపులకు కలత చెంది ఆత్మహత్య చేసుకున్న కూకట్పల్లి బుచ్చమ్మ, వారి కుటుంబ సభ్యులకు ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
ఇందిరాగాంధీ అమలు చేసిన రోటీ, కపడా ఔర్ మకాన్ విధానానికి విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అడుగుజాడల్లో నడుస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తించాలన్నారు. హైడ్రా పేరిట చెరువుల పునరుద్ధరణకు, సుందరీకరణకు సంబంధిత నిపుణులు, ప్రజా ప్రతినిధులతో చర్చించి, ఒక సమగ్ర పాలసీని తయారుచేయాలని సూచించారు. ప్రతి చెరువు క్యాచ్మెంట్ ఏరియా, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ వంటి అంశాలను శాటిలైట్ చిత్రాలు, లైడార్ సర్వే, డ్రోన్ల సాయంతో సేకరించి, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సర్వే పూర్తిచేయాలని సూచించారు.