గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గురువారం హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడాల్సిందేనని బీఆర్ఎస్ తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం వాదించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్లు దాఖలైన మూడు నెలల్లోగా స్పీకర్ వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో తమ పార్టీ గత మార్చి 18న స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదని, అందువల్ల రాజ్యాంగ నిబంధనల మేరకు హైకోర్టు జోక్యం చేసుకోవాలని ఆయన విన్నవించారు.
BRS | హైదరాబాద్, జూన్ 27, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీ ఆర్యమ సుందరం వాదిస్తారని, మధ్యాహ్నం విచారణ చేపట్టాలనికోరారు. ఇందుకు అనుమతించిన హైకోర్టు భోజన విరామం తర్వాత విచారణ చేప్టటింది. అయితే, అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకొని, విచారణను వాయిదా వేయాలని కోరారు. హైకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేందర్గుప్త మృతికి ఫుల్‌కోర్టు సంతాపం తెలుపనున్నదని కూడా ఏజీ చెప్పారు. పిటిషన్ల విచారణకు మరో తేదీని నిర్ణయించాలని కోరారు. ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు విచారణ జరిపేందుకే న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడంతో.. కోర్టు హాల్ నుంచి ఏజీ వెళ్లిపోయారు.
ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా స్పీకర్ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిందని సుందరం మరోసారి గుర్తు చేశారు. ఈ దశలో న్యాయమూర్తి కల్పించుకొని.. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు వీలు లేదని అడ్వొకేట్ జనరల్ గత విచారణలో చెప్పారని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఏ విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవచ్చునో వివరించాలన్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాది ఆర్యమ సుందరం తిరిగి వాదనలు వినిపించారు. శివసేన కేసు, మణిపూర్ ఎమ్మెల్యేల కేసు, రాజేంద్రసింగ్ రాణా కేసులను ఉదహరించారు. ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని, అలా తీసుకోని పక్షంలో పిటిషినర్లు తిరిగి కోర్టుకు రావచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. రాజ్యాంగంలోని 142 అధికరణం కింద సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. తద్వారా స్పీకర్‌కు ఆదేశాల జారీకి వీలున్నట్టు స్పష్టం అవుతున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాల్సిన స్పీకర్, ఆ విధంగా వ్యవహరించకపోతే రాజ్యాంగ రక్షణ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చునని సుందరం తెలిపారు. ఈ ఉత్తర్వులు స్పీకర్‌కు వ్యక్తిగతంగా ఇచ్చినట్లు అవ్వదని, స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయాలని వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్ పిలుపు ఇవ్వడాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఒక పార్టీ మ్యానిఫెస్టో ఆధారంగా గెలుపొంది మరో పార్టీలో చేరడం ప్రజా తీర్పును కాలరాయడమేనని సుందరం అన్నారు. సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టుల తీర్పుల ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్ట సభ సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అయితే ఫిర్యాదు చేసి మూడు నెలలు దాటినా ఇప్పటివరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా ఇవ్వలేదని సుందరం తప్పుపట్టారు. అసెంబ్లీ రూల్స్ 6, 7 ప్రకారం స్పీకర్ వ్యవహరించడం లేదన్నారు. అసెంబ్లీ రూల్ 6 ప్రకారం స్పీకర్ తన ముందున్న ఫిర్యాదుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారో సత్వరమే ఆ కాపీని కూడా స్పీకర్ కార్యాలయం అందజేయాలని చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మార్చి 18న బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారని చెప్పారు. అయినా చర్యలు లేకపోవడంతో ఏప్రిల్ 10న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వివరించారు. ఇప్పుడు జూన్ 27 వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా కౌంటర్‌గా పిటిషన్ వేశారే తప్ప ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేయలేదని చెప్పారు. ఇది స్పీకర్ కార్యాలయం కాలయాపన కాకపోతే ఏమిటని ప్రశ్నించారు. రూల్ 7 (3-బి) ప్రకారం 7 రోజుల్లోగా ఫిర్యాదుపై సంతృప్తి చెందిందీ లేనిది చెప్పాలని, ఈ నిబంధన కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని 226 అధికరణం కింద హైకోర్టు స్పందించాలని కోరారు. అసెంబ్లీ రూల్స్ 6, 7 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయవచ్చునని తెలిపారు.
ఎమ్మెల్యేల పదవీ కాలం ఐదేండ్లని, తీరుబడిగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాలాతీతం చేస్తూ స్పీకర్ స్పందించకపోతే పుణ్యకాలం పూర్తవుతుందని సుందరం ఆందోళన వ్యక్తంచేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుండా తన వద్దనే పిటిషన్‌ను పెట్టుకుంటే అది ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుందని చెప్పారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు నిర్ధారణ అయి మూడు నెలలు దాటినా ఇంకా నోటీసులు ఇవ్వలేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. మూడు నెలల వారం రోజులకు హైకోర్టులో కౌంటర్ వేశారని తెలిపారు. తప్పుడు అభియోగాలు చేశామని చెప్పడం వాస్తవం కాదని చెప్పారు. ప్రజా తీర్పుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయిస్తే ఏమీ కాదనే ధీమా ప్రజాప్రతినిధుల్లో బలపడకూదని పేర్కొన్నారు. దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. ప్రజలు ఓటుతో ఇచ్చిన తీర్పుకు అర్ధం ఉండాలంటే ఫిరాయింపు సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని, పార్టీ ఫిరాయింపుదారులు చట్టసభల్లో సభ్యులుగా ఒకరోజు కూడా కొనసాగేందుకు అర్హత ఉండకూడదని అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట నిబంధనలను అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మరో ఎమ్మెల్యే లేదా ఎంపీ పార్టీ ఫిరాయించేందుకు భయపడాలని చెప్పారు. ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి కల్పించుకుని, పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, దీనిపై వాదనలు వినిపిస్తామని చెప్పారు. అయితే.. ఈ కేసును పదే పదే వాయిదా వేయబోమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేశారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీ ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ తరఫున ఈ ఏడాది మార్చిలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని, అయినా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని ఆయన గుర్తుచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడమే కాకుండా, తన పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో ఇది దారుణమైన విషయమని అభివర్ణించారు. ఈ పరిస్థితుల్లో కూడా స్పీకర్ స్పందించి, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ‘ట్రిబ్యునల్’గా వ్యవహరించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, అది స్పీకర్ రాజ్యాంగ విధి అని చెప్పారు. తన ముందున్న ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే రాజ్యాంగ వ్యవస్థలైన హైకోర్టు, సుప్రీంకోర్టులు స్పందించాలని ఆర్యమ సుందరం కోరారు.