హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఆశలపై నీళ్లు చల్లి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ సత్యవతి రాథోడ్ విమర్శించారు. మంగళవారం శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు అంశాలపై కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు తీర్మానం చేసినట్టు గుర్తుచేశారు.
సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చి 6 నెలలు అవుతున్నా.. అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు పెరుగాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వర్గీకరణకు బీఆర్ఎస్ మద్దతివ్వడమే కాకుండా, అమలుచేసిందని గుర్తుచేశారు. కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణను ఎలా అమలుచేస్తారో చెప్పాలన్నారు.