హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కొంగుబంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబళిస్తున్నారని, ఈ విషయంలో గవర్నర్ తక్షణం కలుగజేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి విన్నవించింది. సింగరేణిలో కుంభకోణాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌కు విన్నవించారు. సింగరేణి విషయంలో సాధ్యమైనంత త్వరగా జోక్యం చేసుకోవాలని, ఆ టెండర్లను ఆపించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా సింగరేణిలో కాంగ్రెస్ కుంభకోణాలపై తక్షణం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తున్న సింగరేణి బొగ్గు గనుల కుంభకోణంపై గవర్నర్‌ను కలిసి సవివరమైన నివేదిక, విజ్ఞాపన పత్రాన్ని తమ పార్టీ తరఫున శాసన మండలి, పార్లమెంట్, శాసన సభ్యులతో కలిసి అందించామని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో త్వరగా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు వివరించారు. సింగరేణిలో భారీగా అవినీతి జరుగుతున్నదని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉప నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా ముందు ఆధారాలు సహా బయపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌లో వణుకు మొదలైందని కేటీఆర్ వివరించారు. మీడియా కూడా తమకు సహకరించి ఆ కుంభకోణాలను పూర్తిస్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టు తెలిపారు. అందుకే ఈ విషయంలో గవర్నర్‌తో క్షుణ్ణంగా మాట్లాడి ఆధారాలతో సహా విజ్ఞాపన పత్రాన్ని అందించినట్టు చెప్పారు. సర్కార్ కుంభకోణాల నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి సిట్ పేరుతో ఒకరి తర్వాత మరొకరిని విచారణకు పిలుస్తున్నారని చెప్పారు. ‘ప్రస్తుతం తెలంగాణలో సీఎం అంటే.. చీఫ్ మినిస్టర్ కాదు. సీఎం అంటే కోల్ మాఫియాకు నాయకుడిగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు, సింగరేణి కార్మికులు కూడా ఈ కుంభకోణాన్ని అర్థం చేసుకున్నారని తెలిపారు.
సింగరేణితో సీఎం ఫుట్‌బాల్
ప్రతిపక్షంగా తాము లేవనెత్తిన ప్రశ్నల విషయంలో ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమైన సమస్యలపై స్పందించాల్సిన ముఖ్యమంత్రి పత్తాలేడని దుయ్యబట్టారు. ఆయన అప్పుడప్పుడు సింగరేణితో ఫుట్‌బాల్ ఆడుతూ విదేశాల్లో తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటునట్టు పోజులు కొడుతున్నాడని ఎద్దేవాచేశారు. ‘అందుకే ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి.. చదుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా ఇప్పుడు చదువుకుంటా అంటే ఏమొస్తదో వారే ఆలోచించాలి’ అని దెప్పిపొడిచారు. ఇప్పటికే సింగరేణికి సంబంధించిన రూ.10 కోట్ల నిధులను ఫుట్‌బాల్ పేరిట దుర్వినియోగం చేశారని చెప్పారు. ‘రాష్ట్ర ప్రజలతో ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో అలాగే సింగరేణితో కూడా ఫుట్‌బాల్ ఆడుతూ ఆ సంస్థకు తీవ్ర అన్యాయం చేశారు’ అని కేటీఆర్ అన్నారు.
బామ్మర్దికి గంపగుత్తగా రాసిచ్చారు
సింగరేణిలో అధికారులను బెదిరించి, కాంట్రాక్టర్లను రింగు చేసి ప్రజాధనాన్ని, సింగరేణి ధనాన్ని కాంగ్రెస్ నేతలు కొల్లగొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సింగరేణి మొత్తం వాటాలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానిదైతే.. 49 శాతం కేంద్ర ప్రభుత్వానిదని.. కాబట్టి ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల సొత్తు అని స్పష్టం చేశారు. ఈ కాంగ్రెస్ కుంభకోణాలపై కార్మికులు ఆలోచన చేయాలని, వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఎలా కొల్లగొడుతున్నదో గమనించాలని కార్మికులను కోరారు. ఈ విషయంలో తాము ఎన్నిసార్లు అడిగినా వారి నుంచి సమాధానం రావడం లేదని తెలిపారు. అన్నదమ్ములు దోచుకుంటున్నది సరిపోవడం లేదని ఇప్పుడు బామ్మర్ది కండ్లల్లో కూడా ఆనందం చూసేందుకు కష్టపడుతున్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల్లో రూ.5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. బీఆర్ఎస్ దాన్ని బయట పెట్టిందని, అన్నదమ్ముల దోపిడీని అడ్డుకున్నదని గుర్తుచేశారు. ఆ దోపిడీ సరిపోవడం లేదని బామ్మర్ది కండ్లల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గంపగుత్తగా రాసిచ్చారని మండిపడ్డారు.
ఆధారాలిస్తం.. విచారణ చేయించండి
‘ఒకరిద్దరు కాదు.. తెలంగాణలో మొత్తం క్యాబినెట్ వాటాలు పంచుకునే క్రమంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్న విషయాలను గవర్నర్‌కు వివరంగా చెప్పినం. తమ అస్మదీయులు, కావాల్సిన వారి కోసం కొత్తగా తెచ్చిన నిబంధనల గురించి వివరించినం. ఏవిధంగా సింగరేణి పొట్ట కొడుతున్నారో చెప్పినం. వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపినం. మీరు సీబీఐ ఎంక్వైరీ వేయిస్తరా? సిట్టింగ్ ఎంక్వైరీ వేయిస్తరా? కేంద్రానికి వెంటనే నివేదిస్తరా? లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తరా? అనేది మీ నిర్ణయం సార్ అని చెప్పినం. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరినం. ప్రజల సొమ్మైన సింగరేణిని కొల్లగొట్టకుండా కాపాడాలని వివరంగా అన్ని విషయాలపై విజ్ఞాపన పత్రం ఇచ్చినం’ అని కేటీఆర్ వివరించారు. అయితే, వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని, తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయంలో గవర్నర్‌పై విశ్వాసం ఉన్నదని చెప్పారు. ‘న్యాయం జరగకపోతే కార్మికలోకం మొత్తాన్ని కదిలిస్తం. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న ప్రతి కుంభకోణం విషయంలో సింగరేణి కోల్‌బెల్ట్‌లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో కార్మిక లోకం మొత్తాన్ని చైతన్య వంతం చేస్తం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని తేల్చిచెప్పారు. కుంభకోణాలను వెలికి తీస్తూ వార్తలు ప్రసారం చేస్తున్న మీడియాకు కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కేటీఆర్ సంధించిన ప్రశ్నలివే
సైట్ విజిట్ సర్టిఫికెట్ విషయంలో ఓవర్ బర్డెన్ (ఓబీ) టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ తీసుకోవాలనే నిబంధన తెచ్చారు. దీంతో పారదర్శకతకు పాతర వేశారు. గతంలో నిబంధన ఎందుకు పెట్టారు? అంటే వారి నుంచి సమాధానం లేదు. దేశవ్యాప్తంగా ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు పెట్టారు? అంటే సమాధానం లేదు. 2018-24 వరకూ ఈ నిబంధనను కేంద్రం సిఫార్సు చేస్తే.. ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అన్ని టెండర్లను కూడా పారదర్శకంగా పిలిచాం. అందుకే ఆ రోజు అన్నీ మైనస్ టెండర్లు వచ్చాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే.. తక్కువకే సింగరేణికి లాభాలు తెచ్చేలా టెం డర్లు వచ్చాయి. ఆ టెండర్లలో లేని షరతు.. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు పెట్టారు? ఎవరికి లా భం చేయడానికి పెట్టారు? అని ప్రభుత్వంలోని బాధ్యులను అడిగితే.. వారి నుంచి సమాధానం లేదు.
ప్లస్ 12 % పెంచింది నిజం కాదా?
2025-26 (జనవరి)లో సైట్ విజిట్ నిబంధన లేకుండా టెండర్ చేశారు. మళ్లీ ఆ టెండర్ వెంటనే రద్దు చేశారు. టెండర్లో ఈ నిబంధన లేకుండా ఆ రోజు టెండర్ పిలిస్తే.. మైనస్ 7 శాతం అంటే రూ.100కు ఎస్టిమేట్ చేస్తే.. రూ.93కే పనిచేస్తామని కాంట్రాక్ట్ సంస్థలు ముందుకొచ్చాయి. దాన్ని రద్దు చేసి, కొత్తగా ఈ నిబంధన పెట్టారు. దానిపై తిరిగి టెండర్లు పిలిస్తే.. ప్లస్ 12 శాతానికి పిలిచారు. దీంతో రూ.100 చేయాల్సిన పని రూ.112కు అయ్యేలా మీరు ఎందుకు నిబంధనలు మార్చారు. ఇది నిజమా? కాదా? సమాధానం చెప్పాలి.
టెండర్లపై శ్వేతపత్రం ఏది?
2025 మేలో ఈ నిబంధన పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ 9 నెలల్లో ఎన్ని సంస్థలు? ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ విజిట్ చేశారు? మీకు ఎన్ని ఈ మెయిల్స్ వచ్చాయి? ఎన్ని లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది? అనే విషయాలను శ్వేతపత్రంలో ప్రచురించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదెందుకు? ఒక్క నైని బొగ్గు గని టెండర్లే కాదు.. అన్ని టెండర్లపైనా శ్వేతపత్రం అడిగాం.. ఎందుకు ఇవ్వడం లేదు?
ఈ కుంభకోణంలో రింగ్‌మాస్టర్ ఎవరు?
సింగరేణిలో ఎన్నో టెండర్లను కొంతమందికే సెలక్టివ్‌గా ఎందుకు ఇచ్చారు? ఎందుకు మిగతావాళ్లను పక్కన పెడుతున్నారు? అనే విషయాలు అడిగినా కాంగ్రెస్ నేతల నుంచి సమాధానం లేదు. ఈ కుంభకోణంలో రింగ్ మాస్టర్ సృజన్‌రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బామ్మర్ది అవునా? కాదా? అని అడిగితే ఎవరి నుంచీ స్పష్టత, సమాధానం లేదు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టెండర్లు పిలిచింది. నాడు లేని ఈ సైట్ విజిట్ నిబంధన ఇప్పుడెందుకు వచ్చింది? అని ప్రశ్నిస్తే.. దానిపైనా సమాధానం లేదు.
సోలార్ పవర్ స్కామ్‌పై సమాధానమేది?
సోలార్ పవర్ స్కామ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం బయటపెట్టింది. దానిపై సంధించిన ప్రశ్నలకు నేటికీ సమాధానం లేదు. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్‌కు రెండున్నర నుంచి మూడు కోట్లలో సోలార్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. తెలంగాణలోని సోలార్ ప్లాంట్ టెండర్లలో సింగరేణి పిలిచిన వాటిలో నిర్మాణం రూ.7 కోట్లు అవుతుంది. ఇలా ఎందుకు అవుతున్నదని నిలదీస్తే ఇంత వరకూ సమాధానం లేదు.
పేలుడు పదార్థాల్లోనూ కుంభకోణమా?
సింగరేణి గనుల్లో పేలుడు పదార్థాలు (జిలిటెన్‌స్టిక్స్ వంటివి) కొనుగోలు చేసేందుకు కూడా 30 శాతం అదనంగా రేట్లు పెంచారు. ఎందుకు పెంచారని అడిగితే సమాధానం లేదు. సింగరేణిలో డైరెక్టర్లుగా ఉన్న జీజీ రెడ్డి, వీకే శ్రీనివాస్ ఎందుకు అదనంగా 30 శాతం రేట్లు పెంచారని ప్రశ్నిస్తే.. బోర్డులో నిలదీస్తే.. వారిపై యాక్షన్ తీసుకున్నారు. కానీ, ఆ కుంభకోణాన్ని ఆపలేదు. కుంభకోణాలు చేయడంలో, కాంట్రాక్టర్లకు మేలు చేసే విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. దీనిపై నిలదీస్తే సమాధానం లేదు.
సింగరేణిలో బొగ్గు కుంభకోణం, సోలార్ పవర్ స్కామ్, సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణాలను అడ్డుకోవాలని, వెంటనే విచారణ జరిపించి, ప్రజా సొమ్మును కాపాడాలని సింగరేణి కార్మికుల పక్షాన గవర్నర్‌కు విన్నవించాం.. ప్రజాధనాన్ని కొల్లగొట్టే దుర్మార్గపు వ్యవస్థను శిక్షించాలని కోరినం. -కేటీఆర్
సర్కార్ కుంభకోణాల నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి సిట్ పేరుతో ఒకరి తర్వాత మరొకరిని విచారణకు పిలుస్తున్నరు. ప్రస్తుతం తెలంగాణలో సీఎం అంటే.. చీఫ్ మినిస్టర్ కాదు.. కోల్ మాఫియాకు నాయకుడిగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది.
-కేటీఆర్