ఖమ్మం, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ నెల 18న ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగసభకు జన ప్రభంజనం కోసం జిల్లా గులాబీ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టగా.. మరోవైపు పోలీ సు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యా రు. 18న ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు మరో మూడు రా ష్ర్టాల ముఖ్యమంత్రులూ హాజరుకానున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సభ విజయవంతం కోసం బీఆర్ఎస్ నేతలు సమాయత్తమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితర నేతలు ఇప్పటికే జన సమీకరణపై దృష్టి సారించారు.
ఖమ్మం సభ చరిత్రాత్మకం కావాలని అధినేత కేసీఆర్ ఇప్పటికే జిల్లా నాయకులకు చేసిన దిశానిర్దేశం మేరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా జన సమీకరణ, సభ విజయవంతం కోసం రంగంలోకి దిగారు. సీఎం ఆదేశంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం వారు ఖమ్మం చేరుకొని మంత్రి అజయ్క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జులతో సమావేశం కానున్నారు.
ఏర్పాట్లపై అధికారుల సమాయత్తం
మరోవైపు ఖమ్మం సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి అధికారులు సర్వం సమాయత్తమయ్యారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 100 ఎకరాల స్థలంలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలిని మంగళవారం ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు డీసీపీ సుభాశ్ చంద్రబోస్ తదితరులు పరిశీలించి సభా ఏర్పాట్లపై సమాలోచనలు చేశారు.