CM KCR | ఈ కొస నుంచి ఊరేగింపు, ఆ కొసన సభాస్థలి.. మధ్యన దూరం రెండున్నర కిలో మీటర్లు. అంతదూరం దారి పొడవునా గంటల తరబడి వేచిచూస్తూ నిలబడిన జనం. ఆడామగా, పిల్లాజెల్లా, ముసలీముతకా తేడాలేదు. కేసీఆర్ కనిపించగానే మహారాష్ట్ర సంప్రదాయంలో ఆశీర్వదిస్తున్నట్టుగా రెండుచేతులూ పైకెత్తి స్వాగతించారు.
దుకాణాల్లో ఉన్నవాళ్లు అక్కడినుంచే పిడికిళ్లు పైకెత్తి విజయసంకేతం చూపిస్తూ సంఘీభావం తెలిపారు. ఎక్కడా తీసుకొచ్చిన జనం లేరు. కిరాయి వాహనాల్లేవు. సభకు సహజంగా తరలివచ్చిన మనుషులు.. మనసులే! తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకుని తమలో తామే ప్రవాహంలా కదిలిన మనుషులు!
అక్కడి ప్రతి ఒక్కరిలోనూ ఒకే సందేహం..
తెలంగాణలో ఉన్నవి మనకెందుకు లేవు? తెలంగాణలో 8 ఏండ్లలో జరిగింది.. ఇన్నేండ్లయినా మనకెందుకు జరుగలేదు?
అందరిలోనూ ఇదే అంతర్మథనం..
మన నేలా తెలంగాణలా మారాలంటే, మనమూ తెలంగాణవాళ్లలా వెలగాలంటే ఏం చేయాలి?
(కంధార్ లోహా నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): ‘మా ఏరియాలో ఇట్లాంటి సభ మునుపెన్నడూ చూడలేదు. కేసీఆర్ అంటేనే జోష్. అందుకే బైల్‌బజార్ మైదానంలో ఆయన సభకు నాలాగా వేలమంది ఖేడేగావ్ (పల్లెల) నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు. మాకు కుర్చీలు వేసి మరీ కూర్చోబెట్టారు. ఇంతవరకు మమ్మల్ని ఇలా సభలో గౌరవించినోళ్లు లేరు’.. ఇది దేపుల్గావ్కు చెందిన రైతు వామన్ పాంచాల్ ఒక్కడి మాట కాదు, సభ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరిని కదిపినా సంబురంగా చెప్తున్న మాట ఇదే. మరాఠ్వాడా ప్రాంతంలో గతంలో జరిగిన సభకు, బీఆర్ఎస్ సభకు మధ్య అంతరం అదే. అందుకే కేసీఆర్ సభ ముగిసినా దాని ప్రకంపనలు ఆగలేదు. ప్రజల్లో నిన్నటి జోష్ ఏమాత్రమూ తగ్గలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌ను చూసి తెలంగాణ ప్రజల్లో కనిపించిన సంరంభం, ఉద్వేగం.. ఇప్పుడు మరాఠ్వాడా గడ్డపై స్పష్టంగా కనిపించింది!
నాందేడ్ జిల్లా కంధార్ లోహాలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ సభకు అనూహ్య స్పందన వచ్చింది. చుట్టుపక్కల ఊళ్ల నుంచి వేలాది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కిరాయి వాహనాల్లేవు. కూలీ ఇస్తే వచ్చినోళ్లు కాదు. కండ్ల ముందు తెలంగాణ కల సాకారమై.. శిఖరాయమానంగా ప్రగతి ప్రజ్వలిస్తున్న దృశ్యాన్ని చూసినవాళ్లు. తమ ప్రాంతానికీ ఆ వైభోగం దక్కాలని తపిస్తున్నవాళ్లు. తమకూ కేసీఆర్ మార్గనిర్దేశనం దొరకాలని కాంక్షిస్తున్నవాళ్లు. అందుకే వాళ్లంతా కేసీఆర్ సభలో గులాబీ కండువాలను మెడలో వేసుకుని మురిసిపోయారు. బీఆర్ఎస్ నేతలు వేలాది కండువాలు తెప్పించినా వచ్చిన జనానికి సరిపోలేదు. వేయించిన కుర్చీలూ సరిపోనంతగా జనం కనిపించారు. సభ జరిగిన బైల్‌బజార్ ఒక్కటే కాదు.. సభాప్రాంగాణానికి వెళ్లే ప్రతి దారిలోనూ జనమే. కేసీఆర్ ప్రసంగం మొత్తాన్ని ఆసక్తిగా విన్న మరాఠ్వాడా వాసులు.. ఆయన ప్రతి మాటకూ తమ ప్రతిస్పందన తెలియజేశారు. చప్పట్లు కొట్టారు. చేతులు పైకెత్తి సంఘీభావం తెలిపారు. ఆనందించారు.. ఆలోచించారు.
బీఆర్ఎస్ బహిరంగ సభకు లాతూర్, పర్భణి, నాందేడ్, బీడ్ జిల్లాల నుంచి వేలసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రతి గ్రామం నుంచి కదిలివచ్చిన వారిలో కర్షకులు, కూలీలు ప్రధానంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ పథకాలపై మహారాష్ట్రలో జోరుగా చర్చ కొనసాగుతుండగా.. దానిపై మరిన్ని విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే తాము సభకు వచ్చినట్టు పలువురు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నాయకులు దశాబ్దాలుగా చేస్తున్న వంచనను గుర్తెరిగిన వారు.. తమ అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణలో ఉన్నటువంటి పథకాలను తమ నేతలు అమలుచేస్తారనే నమ్మకమేదీ తమకు లేదనే భావనను వెలిబుచ్చుతున్నారు.
దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని, తొమ్మిదేండ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నదని వారు అభిలషిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మరాఠా పల్లెల్లో ప్రతిధ్వనిస్తున్నది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన వసతులు, అమలవుతున్న సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వారు ఇప్పుడు పోల్చి చూసుకుంటున్నారు. దీనిపై రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, చేతివృత్తి కళాకారులు, వీధి వ్యాపారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇలా దాదాపు అన్నివర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీలు కాకుండా రైతులు గెలువాలని, నదుల నీరు సముద్రంలో కాకుండా సాగు భూములకు పారాలని, గోదావరి, పూర్ణ, వార్ధా, పెన్‌గంగ, మంజీరా, ప్రాణాహిత నదులను వినియోగించుకోవాలని కేసీఆర్ చెప్పిన మాటలు మహారాష్ట్రవాసులను హత్తుకోవడమేకాదు, వారిలో ఆ దిశగా ఆలోచనలు రేకెత్తించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దశాబ్దాలుగా వంచనకు గురవుతున్న మరాఠా రైతుల్లో కేసీఆర్ సభ ఒక కొత్త విశ్వాసాన్ని నింపింది. మరాఠా ప్రజానీకంలో కొత్త ఆశలను, భవిష్యత్తుపై నమ్మకాన్ని కల్పించింది. మరోవైపు ఫిబ్రవరి 5న నాందేడ్‌లో నిర్వహించిన సభను మించి లోహ బహిరంగ సభ రెట్టింపు సక్సెస్ కావడంతో మహారాష్ట్ర గులాబీ శ్రేణుల్లోనూ నయా జోష్ ఉరకలెత్తుతున్నది.
ఆదివారం లోహాలో జరిగిన బీఆర్ఎస్ సభకు హాజరయ్యేందుక వచ్చిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబురంగా స్వాగతం పలుకుతున్న ప్రజలు
కంధార్-లోహా బహిరంగ సభను మరాఠా మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. కేసీఆర్ లేవనెత్తిన అంశాలను అవి కూలంకషంగా వివరించాయి. దాదాపు అన్ని ప్రతికలు ‘తెలంగాణా మే ప్రగతి హో సక్తా హై తో.. మహారాష్ట్ర మే క్యోఁ నహీ’ అనే పతాక శీర్షికతో వార్తలను ప్రచురించాయి. మరఠ్వాడా నేత, గోదాతీర్, తరుణ్ భారత్, ఘోషణ్, లోక్మత్, సకాళ్, భాస్కర్, పూదారి, ప్రజావాణి తదితర స్థానిక మరాఠీ పత్రికలు కేసీఆర్ సభకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. సభకు సంబంధించిన అంశాలను, కేసీఆర్ లేవనెత్తిన అంశాలను కూలంకషంగా విశదీకరిస్తూ వార్తలను ప్రచురించాయి. జాతీయ మీడియా సైతం కేసీఆర్ ప్రసంగాన్ని, లోహా సభ విశేషాలను ప్రముఖంగా ప్రచురించింది.
‘అంబేద్కర్ పుట్టిన నేలలో దళితబంధు ఎందుకు లేదు? గోదావరి, కృష్ణా పురిటిగడ్డ ఎడారిలా ఎందుకున్నది? వ్యక్తులు మారారే తప్ప కాంగ్రెస్, బీజేపీకి తేడా లేదు. పాలకులు, పార్టీలు మారినా పేదల బతుకులు మారలే. మీరు గెలిపించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్కడ నిద్రపోతున్నరు? తొమ్మిదేండ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలువలేదా? తెలంగాణ బాగైనప్పుడు.. మహారాష్ట్ర ఎందుకు కాదు?’ అంటూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలు మరాఠ్వాడాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రైతులు, యువత, కార్మికులు, కూలీలు, ఉద్యోగవర్గాలను ఆలోచింపజేస్తున్నాయి. ‘ఐక్యంగా పిడికిలి బిగిస్తేనే సమూల మార్పు తథ్యం’ అంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు వారిని తట్టిలేపింది. కేసీఆర్ సింహగర్జన అక్కడి పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నది.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహ పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహించిన రెండోభారీ బహిరంగా సభ దిగ్విజయమైంది. సభకు వేలాదిగా తరలి వచ్చిన జనం.. కేసీఆర్ సందేశాన్ని ఆద్యంతం ఎంతో ఆసక్తిగా విన్నారు. ఎలాంటి ఆవేశాలు లేకుండా, భీకర వ్యాఖ్యానాలు లేకుండా అతి సాధారణ ధోరణిలో, ఉన్నది ఉన్నట్టుగా.. విడమరచి చెబుతూ.. ప్రశ్నలను లేవనెత్తుతూ సాగిన ప్రసంగం మహారాష్ట్ర వాసులను ఆకట్టుకున్నది. గ్రామగ్రామాన ఇప్పుడు కేసీఆర్ లేవనెత్తిన అంశాలపైనే జోరుగా చర్చ జరుగుతున్నది.
సోలాపూర్‌లో మాట్లాడుతున్న మాజీ ఎంపీ సాధుల్ ధర్మన్న, చిత్రంలో పద్మశాలి సంఘం నేతలు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటే తాము నడుస్తామని సోలాపూర్ మాజీ ఎంపీ సాధుల్ ధర్మన్న, పశ్చిమ మహారాష్ట్ర అఖిల భారతీయ పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ పెనుగొండ గణేశ్ వెల్లడించారు. సోమవారం సోలాపూర్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కొనియాడారు. దేశానికి తెలంగాణ మాడల్ అవసరమని, అందుకే తాము బీఆర్ఎస్లో చేరుతున్నామని ప్రకటించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం నేతలు విక్రమ్ పిస్కే, తడగొప్పుల అంబదాస్, కందికట్ల రఘురాములు తదితరులు పాల్గొన్నారు.