హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): బీజేపీని ఇంటికి సాగనంపేందుకు దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావశక్తిగా అవతరించబోతున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రెండో బహిరంగసభను విశాఖపట్నంలో నిర్వహిస్తామని, త్వరలో తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభా ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ భారత రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందని, కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి చేస్తున్న పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని పేర్కొన్నారు.
ఏపీలో రాజధానే లేదు..: తెలంగాణలో విజయవంతమైన రైతు అనుకూల విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రైతాంగం ఆశిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘అబ్ కీ బార్..కిసాన్ సర్కార్’ ఇచ్చిన నినాదం అద్భుతమని తోట చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తే ఆంధ్రప్రదేశ్ అందుకు విరుద్ధంగా తయారైందన్నారు. రాష్ట్రం విడిపోయి 8 ఏండ్లయినా ఇప్పటికీ ఏపీ రాజధాని విషయంలో స్పష్టత లేకపోవడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు.
రఘునందన్ వ్యాఖ్యలపై ఆగ్రహం
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనపై చేసిన వ్యాఖ్యలను తోట చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రఘునందన్ మాట్లాడుతున్నారని తెలిపారు. తనపై రఘునందన్‌రావు చేసిన భూ ఆరోపణలపై సర్వే చేసి, ఏ సర్వేలో తన పేరు మీద భూమి ఉన్నదని తేలినా ఆ భూమిలో 90 శాతం ఆయన తీసుకొని మిగతాది తనకు ఇవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ ఎదుగుదలను, తన రాజకీయ ప్రయాణాన్ని రఘునందన్‌రావు లాంటి వాళ్లు ఆపలేరని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.