CM KCR | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, సీనియర్ రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కీలక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకొనేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పలువురు ఎన్సీపీ నేతలు భేటీ అయ్యారు. బహిరంగసభ నిర్వహణ, చేరికలు, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై వారితో సీఎం కేసీఆర్ చర్చించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ సభ దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సత్తా చాటడంతోపాటు సంచలనంగా మారింది. దేశ రాజకీయాలు బీఆర్ఎస్వైపు చూసేలా చేసింది. ఇదే స్ఫూర్తితో త్వరలో జరుగనున్న కాందార్ లోహ సభను అంతకు మించి విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.
భారత రాష్ట్ర సమితి పార్టీ విధానాలు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పథకాలు మెచ్చి, నచ్చిన పలు రాష్ర్టాల్లోని రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వరుస కడుతున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన పలువురు కీలక సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొచ్చారు. ఈ నేతలంతా మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎన్సీపీ నుంచి బీఆర్ఎస్లో చేరే వారిలో మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న డోండ్గే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్ (ఈయన భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ మీద కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు), ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, ఎన్సీపీ యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగ్డే, ఎన్సీపీ నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపీ లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపీ కాందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యుడు అడ్వొకేట్ విజయ్ ధోండిగే, ఎన్సీపీ యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వారాడ్, స్వాప్నిల్ ఖీరే తదితరులు ఉన్నారు. వీరంతా పెద్ద సంఖ్యలో తమ కార్యకర్తలు, అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.

Thota Chandrashekar
దేశ రాజకీయాలు, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ముందుకు సాగుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న రైతు, ప్రజా సంక్షేమ పథకాలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి పథకాలు తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి దార్శనికత గల నాయకుడు తమకు ముఖ్య మంత్రిగా ఉండాలని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకొంటున్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశ రాజకీయాల్లోకి రావడాన్ని వారంతా సాదరంగా స్వాగతిస్తున్నారు. బీఆర్ఎస్ ద్వారానే దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలవుతాయని, తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని వారు విశ్వసిస్తున్నారు. ఇందుకు నాందేడ్ సభ విజయవంతం కావడమే సాక్ష్యంగా నిలుస్తున్నది.