KCR | హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) :ఎంత మంచిగుండె తెలంగాణ.. బొందలపడేసిండ్రు.. నా కండ్ల ముందే ఇట్లయితదని అనుకోలే’ అని కేసీఆర్ వాపోయారు. ఎల్కతుర్తి సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన తెలంగాణను ఇప్పుడు 14, 15వ స్థానంలోకి పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇయ్యాల చాలా బాధ కలుగుతున్నది. చాలా దుఃఖం కలుగుతున్నది. ఇంకా ముందుకు పోవాల్సిన తెలంగాణ వెన్కకు పోతున్నది. దీనికి కారణం ఎవరు..? ఈ దుర్మార్గులు కాదా? వాళ్లను నిలబెట్టి అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా?’ అని ప్రశ్నించారు. ‘ఒక చిన్న మాట.. కేసీఆర్ కిట్ పథకం పెట్టినం.. ఇది లక్షాధికారుల కోసం పెట్టినమా? కోటీశ్వరుల కోసం పెట్టినమా? ఎవరి కోసం పెట్టినం? గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం పెట్టినం.. ఆడ పిల్లను కంటే 13 వేలు, మగ పిల్లవాన్ని కంటే 12 వేలు ఇచ్చినం.
అమ్మ ఒడి వాహనాలు పెట్టి వాళ్లను దవాఖానకు తీసుకెళ్లి ఉచితంగా ప్రసవాలు చేయించి వాళ్లకు మందులిచ్చి జాగ్రత్తగా ఇంటికాడ దింపినం. ఇది బంద్ చేస్తరా ఎవరైనా?. ఎందుకు బంద్ చెయ్యాలె? ముఖ్యమంత్రులుగా పని చేసేవాళ్లకు గాంభీర్యం ఉండాలె.. ధైర్యం ఉండాలె.. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. నేను సీఎం అయిన తర్వాత ఈ పథకం ఎలా ఉన్నదని అధికారులను అడిగిన. సార్..ఈ పథకం మంచిగున్నది.. ప్రజలకు ఉపయోగపడుతున్నదని చెప్పిండ్రు. నేను కూడా ఆ పథకాన్ని అట్లనే ఉంచండి.. మార్చకండని ఆదేశించిన. అసెంబ్లీలో కూడా ఆరోగ్యశ్రీ మా పథకం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.. దాని పేరు కూడా మార్చలేదని చెప్పినం. కానీ ఇప్పుడు వీళ్లు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తం.. కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తమంటున్నరు. చేస్తరా?
నాడు బుల్డోజర్లు చెరువుల్లో పూడిక తీస్తే.. నేడు పేదల ఇండ్లు కూలగొడుతున్నయి
ప్రభుత్వ జాగల్లో గుడిసెలు వేసుకున్న లక్షలాది మంది పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్, వరంగల్‌తో పాటు అనేక ప్రాం తాల్లోఇండ్ల పట్టాలిచ్చినం. బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి మేం చెరువుల్లో పూడికలు తీస్తే.. వీళ్లే మో హైడ్రా అని పేదల ఇండ్లు కూడలగొడుతున్నరు. ఇవన్నీ చూసి మౌనంగా ఉందామా? ఏం చేద్దాం? ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
ఏ భూములు అమ్మాలో ఏవి అమ్మొద్దో విచక్షణ ఉండొద్దా?
మాట్లాడితే బీఆర్ఎస్పై బద్నాం పెడ్తున్నరు. వశమైతలేదని భూములను అమ్మకానికి పెడుతున్నరు. అత్యవసరమైతే కొన్ని అమ్మొచ్చు! ప్రజలకు అవసరం లేని భూములను, విలువ వచ్చేది ఉంటే ప్రజల పనుల కోసం కొన్ని అమ్మొచ్చు! కానీ ఏది అమ్మాలో ఏది అమ్మొద్దో విచక్షణ ఉండాలె కదా? యూనివర్సిటీలను అమ్ముతరా? ఇయ్యాల హెచ్‌సీయూను అమ్ముతున్నరు. విలువైన భూములున్నయని రేపు ఓయూను అమ్ముతరు. ఇలా ఖతం పట్టుకుంట పోతే ఏమైనా మిగులుతదా? ఇది పద్ధతా? ప్రభుత్వం నడిపించే విధానమా? వీళ్లు ఏ విధంగా గోల్మాల్ చేస్తున్నరో అందరూ గమనించాలె. నేను యాదగిరి గుట్టకు పోతే ట్రిప్పుకు ఎకరానికి పది లక్షల విలువ పెరుగుతుండె.. మరియ్యాల ఏమైతున్నది? ఏం జరుగుతున్నదో ఆలోచన చెయ్యాలె!
గౌరవెళ్లి, పాలమూరు ఎందుకు పెండింగ్?
సభకు వచ్చేటప్పుడు హుస్నాబాద్‌లో చూసిన. నాడు హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను మెప్పించి ఒప్పించి భూములు తీసుకొని గౌరవెళ్లి ప్రాజెక్టు కట్టినం. ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయింది. కానీ ఏడాదిన్నరగా అందులో తట్టెడు మన్ను తీస్తున్నరా?. పాలమూరు పథకం 80 శాతం పూర్తయింది. ఎందుకు దాన్ని పెండింగ్‌లో పెడుతున్నరు? ఎందుకు పూర్తి చేస్తలేరు?
ఆర్థిక మంత్రీ.. నీకెందుకయ్యా అంత బాధ?
ఇగ ఈ అందానికి ఏం మాట్లాడుతరు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటున్నరు. ఎందుకు నీ కాయగోకుడు ముచ్చట్లు ఇనడానికా? పిల్లలు (కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి) అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. 20 శాతం కమీషన్ తీసుకుంటున్నరని కేటీఆర్ మాట్లాడితే.. ఆ ఆర్థిక మంత్రి లేచి బుజాలు తడుముకుంటున్నడు. నీకెందుకయ్యా బాధ. నువ్వు తీసుకుంటెనే నీకు బాధ ఉండాలె.. లేచి పెద్ద లొల్లి పెడుతున్నడు. ఇది నేను చెప్పింది కాదు.. ఆర్థిక మంత్రి ఆఫీసు ముందట కాంట్రాక్టర్లే ధర్నా చేసిండ్రు. 20, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నరని ఆందోళన చేసిండ్రు’ అని కేసీఆర్ చెప్పారు.l ప్రభుత్వాన్ని మేం పడగొట్టం..
ప్రజలే మీ ఈపులు సాప్చేస్తరు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారనే ఆరోపణలను కేసీఆర్ తోసిపుచ్చుతూ ‘నేనింకో ముఖ్యమైన మాట చెప్పాలె. ప్రభాకర్‌రెడ్డి అని మా దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నడు. ఆయనతో ఎవరో హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. అన్నా ఇంకా మూడేండ్లు భరించాలానే ఈ గవర్నమెంటును అని మాట్లాడిండు. ఆయన ఆ మాటను విలేకరులకు చెప్పిండు. దాన్ని పట్టుకొని అగో చూసిన్రా మా గవర్నమెంటును పడగొడతరట! అని అంటున్నరు. అరె మేమెందుకు పడగొడతంరబై! మాకేమన్న కాళ్లుచేతులు గులగుల పెట్టినయా? మేమా కిరికిరి పనిచెయ్యం. మీరే ఉండాలె. ఓట్లు తీసుకున్నరు. సక్కగ పనిచెయ్యకపోతే మీ ఈపులు ప్రజలే సాప్ చేస్తరు. మేం మీ గవర్నమెంటును పడగొట్టం. ఎందుకంటే మీ సంగతేందో మా సంగతేందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలె’ అని కేసీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రులుగా పని చేసేవాళ్లకు గాంభీర్యం ఉండాలె.. ధైర్యం ఉండాలె.. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండ్రు.
నేను సీఎం అయిన తర్వాత అధికారులను అడిగి ఆ పథకాన్ని అట్లనే ఉంచండి.. మార్చకండని చెప్పిన. ఆరోగ్యశ్రీ మా పథకం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది.. దాని పేరు కూడా మార్చలేదని అసెంబ్లీలో కూడా చెప్పిన. కానీ ఇప్పుడు వీళ్లు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తం.. కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తమంటున్నరు. చేస్తరా?
-కేసీఆర్
ప్రభుత్వ జాగల్లో తెలిసో తెలియకో పేదలు గుడిసెలు వేసుకుంటరు. అలాంటి లక్షలాది మంది పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్ల పట్టాలిచ్చినం. బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి మేం చెరువుల్లో పూడికలు తీస్తే.. వీళ్లేమో హైడ్రా అని వాడి బొంద అని పెట్టి పేదల ఇండ్లు కూడలగొడుతున్నరు. ఆనాడు చెరువుల పూడికలు తీసిన బుల్డోజర్లు ఈనాడు పేదల ఇండ్లు కూలగొడుతున్నయి.– కేసీఆర్