నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 5: రేవంత్‌రెడ్డి పాలనపై నిరుద్యోగ యువత, విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. సదస్సులు నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదేం సర్కార్.. ఇదేం పరిపాలన? అంటూ మండిపడ్డారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విద్యార్థి, యువత సమరభేరి సభ నిర్వహించగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా వీరికి కేటీఆర్ ఫోన్‌చేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. సిద్దిపేట పాత బస్‌స్టాండ్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనలో బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు పాల్గొని సర్కార్‌పై ధ్వజమెత్తారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రెండు వేల బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ములుగులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థి సదస్సు నిర్వహించారు. జనగామలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత భారీ నిరసన ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొని సర్కార్ తీరును ఎండగట్టారు.
మహబూబ్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆందోళనలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బైక్ ర్యాలీతోపాటు విద్యార్థి, యువ సదస్సు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాలలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మెట్పల్లిలో చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్‌లోని కనాజిగూడ నుంచి బొలా ్లరం రైల్వే గేట్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ ని యోజకవర్గంలోని అశోక్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.



