నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 30 : బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను కుదించడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. బీఆర్ఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు, స్వేరోస్ ప్రతినిధులు, గురుకుల పూర్వ విద్యార్థులు, గురుకుల కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు నిరసనలకు దిగారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు గతంలో ఇచ్చిన ఎక్స్ క్యాటగిరీ భద్రతను తొలగించడాన్ని నిరసిస్తూ ఎల్బీనగర్లో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, ఆర్ఎస్పీ అభిమానులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను పెంచాలని కోరుతూ 25 మంది కార్యకర్తలు, అభిమానులు వేర్వేరుగా ఇన్స్పెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అందోజు శంకరాచారి మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్‌తో సత్కరించిందని అన్నారు. గతంలో ఆర్ఎస్పీని తుదముట్టించేందుకు నాలుగుసార్లు ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన నాటి ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఎక్స్ క్యాటగిరీ భద్రతను కల్పించిందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాడన్న అక్కసుతో రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను చంపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశానికి, రాష్ర్టానికి ఎలాంటి సేవలు చేయని సీఎం రేవంత్ సోదరులకు ప్రభుత్వం భద్రత ఎలా కల్పిస్తున్నదని ప్రశ్నించారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సెక్యూరిటీని తగ్గించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్వేరోస్, ఎంఎస్ఎఫ్ నాయకులు మంగళవారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ మెయిన్‌గేటు ఎదుట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందె కార్తీక్ మాదిగ, స్వేరో పీయూ ఇన్చార్జి పవన్ మాట్లాడుతూ ఆర్ఎస్పీకి భద్రతను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల కాంట్రాక్టర్ల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణం, సిర్పూర్(టీ)లోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.