భీమదేవరపల్లి, జూలై 19 : ఒకనాడు గ్రంథాలయాలు దేదీప్యమానంగా విరాజిల్లాయని, ప్రస్తుత తరుణంలో దయనీయంగా మారుతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల బహుమతుల ప్రదానోత్సవంలో వక్తలు మాట్లాడుతూ.. పాటలు, రచనలు, నవలలు, కథలు మనిషిని తట్టి లేపుతాయని అన్నారు. సమాజంలో జరుగుతున్న ఘటనలను పాటలు, కథల రూపంలో వ్యక్తపరుస్తాయని తెలిపారు. సాంస్కృతిక వికాసానికి కేంద్రంగా గ్రంథాలయాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. గ్రంథాలయాలకు కడుతున్న సెస్ పక్కదారి పడుతున్నదని, తద్వారా వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
‘నమస్తే తెలంగాణ పత్రిక – ముల్కనూరు సాహితీ పీఠం’ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజాగ్రంథాలయం మరింత ముందుకు సాగాలని, వారి కృషిని అభినందిస్తున్నట్టు తెలిపారు. కవులకు కొలమానాలు ఉండవని, చాలారోజుల తర్వాత మనుషుల మధ్య గడిపిన అనుభూతి ఈ కార్యక్రమం ద్వారా కలిగిందని పేర్కొన్నారు. అద్భుతమైన దేవాలయాలు చూశాం కానీ, అందమైన గ్రంథాలయాన్ని ఈ రోజే చూశామని ఆనందం వ్యక్తంచేశారు. విభిన్న కథలు, రచనలతో అభివృద్ధికి పాటుపడాలని కవులను కోరారు. టీవీలు, సెల్ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటికీ ముల్కనూరు ప్రజాగ్రంథాలయం దినదినాభివృద్ధి చెందడం గొప్పవిషయమని కొనియాడారు. నేటి యువత పుస్తక పఠనాన్ని వ్యసనంగా మార్చుకోవాలని సూచించారు.
ఆధునికత పెరిగినా మనిషి బాధలు, ఆనందాలను కథల రూపంలో తీసుకొచ్చేది సాహిత్యం మాత్రమేని స్పష్టంచేశారు. ఎంత టెక్నాలజీ వచ్చినా మరికొన్ని సంవత్సరాల తర్వాత కూడా సాహిత్యం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ ద్వారా దేశంలో ఉన్న కవులందరికి తమ రచనలకు ఒక వేదిక దొరికినట్టు అయిందని అన్నారు. అనంతరం ప్రథమ బహుమతి పొందిన పొన్నాడ వెంకట అన్నాజీరావు, ద్వితీయ బహుమతి సుదర్శనం రంగనాథ్, సుజన్‌కుమార్, తృతీయ బహుమతి పొందిన ఐదుగురు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్, కవి, రచయిత జయరాజు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ప్రసంగించగా, నమస్తే తెలంగాణ ఫీచర్స్ ఎడిటర్ నాగరాజు, చిల్ల శ్రీనివాస్, కథల పోటీల న్యాయ నిర్ణేతలు అనంతకుమార్, శశిధరాచారి, ముల్కనూరు సర్పంచ్ జాలి ప్రమోద్‌రెడ్డి, ముల్కనూరు సాహితీ పీఠం అధ్యక్షుడు వంగ రవి, కవులు, రచయితలు పాల్గొన్నారు.
కళాకారులకు ప్రతిభ, సాధన ఉంటే సరిపోదు. వారి కలను గుర్తించే వేదిక, అనువైన వాతావరణం కావాలి. అది మాకు ముల్కనూరు సాహితీ పీఠంలో లభించింది. ప్రతి సంవత్సరం ఇన్ని కథలను ఎంపిక చేసి బహుమతులు ఇచ్చి ప్రచురించడం కథల వైవిధ్యానికి ప్రధాన కారణం. సంఖ్య, బహుమతి విలువ, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడానికి నాణ్యతను నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఏ సంస్థ గొప్పతనమైన తన రంగంలోని గొప్ప వారిని గౌరవించడంతోపాటు కొత్త వారిని గుర్తించడంలో ఉంటుంది. అలాంటి సంస్థ జీవనదిలా ఎల్లప్పుడూ ముందుకు పయనిస్తూనే ఉంటుంది. సమయంతోపాటు పెద్దది అవుతూ ఆ దేశ సంస్కృతిలో భాగమైపోతుంది. ‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీ పీఠం’ తీరు కూడా నాకు అలానే అనిపిస్తుంది.
ముల్కనూరు సాహితీ పీఠం కథనాలు నమస్తే తెలంగాణ దినపత్రికకు అనుబంధమైన బతుకమ్మ సంచికలో ప్రచురితమైతే జ్ఞానపీఠ్ అవార్డు వచ్చినంత అనుభూతి కలుగుతుంది. ఈ కాలంలో సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించడం మామూలు విషయం కాదు. అలాంటిది తెలుగు రాష్ర్టాల్లో సాహిత్యాన్ని పెంపొందించేందుకు ముల్కనూరు సాహితీ పీఠం తీవ్రంగా కృషి చేస్తుంది.

నేటి సమాజంలో కులాలు, మతాలకు విభజన రేఖగా ఉంటే సాహిత్యం అందరినీ ఒకే వేదికపైకి తీసుకొని వస్తుంది. దేవుడంటే మనుషులందరికీ నమ్మకమే. అయితే కొందరు దేవుడికి.. మనుషులకు మధ్య అడ్డుగీతగా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో ‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీ పీఠం’ సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్యాన్ని ప్రోత్సహించి నడిపించడం నిజంగా హర్షణీయం.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీ పీఠం’ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కథల పోటీలు నిజాయతీ, నిబద్ధత, పారదర్శకతతో ఉంటాయి. నీవు యువకుడివి ముల్కనూరు సాహితీపీఠానికి ఎంతోమంది అనుభవజ్ఞులు, మేధావులు, కవులు, రచయితలు వస్తారు.

నీలాంటి కొత్త వారికి అందులో స్థానం లభిస్తుందా? అని ప్రశ్నించారు. నేను గతంలో ఒత్తుకొండ అనే కథకు రూ.5వేలు బహుమతి తీసుకుంటే, ఇప్పుడు ‘రా’.. బంధువు కథకు ద్వితీయ బహుమతి లభించింది. అనుభవం ఉన్న రచయితలు అని కాదు, కథకు ఉన్న విలువకే ప్రాధాన్యం ఇస్తారనడానికి ఇదే నిదర్శనం.
కథలు పాత్రలను పోషించడమే కాదు, జీవితాలను ప్రతిబింబిస్తాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఈ కథల పోటీలు జరుగుతున్నాయి. రచయితలు, కవులకు ఈ పోటీలు సువర్ణావకాశం. ఈ సాహితీ పీఠం ఏర్పాటు చేస్తున్న కథల పోటీల్లో ఇప్పటికి నాలుగుసార్లు బహుమతులు తీసుకున్నా.

ఇందులో మూడుసార్లు తృతీయ బహుమతి వచ్చింది. నాది ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా కాసీంకోట కుగ్రామం. అయినప్పటికీ ముల్కనూరు సాహితీ పీఠం నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది.