వికారాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా లో ప్రీ ప్రైమరీ స్కూళ్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించగా ఆదిలోనే రాజకీయ జోక్యం అడ్డు తగులుతుండడం గమనార్హం. గత నెల 15 నుంచే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ జిల్లాలోని ఎమ్మెల్యేల జోక్యంతో వాటి ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఒక్కో స్కూల్లో టీచర్, ఆయాను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారి నియామకంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడంతోనే ఆ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. కాగా, ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాకు ఈ విద్యా సంవత్సరం 101 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రభు త్వం మం జూరు చేసింది. టీచర్లు, ఆయాల కోసం జిల్లాలో 947మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియను జూన్ 15 వరకు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఎమ్మెల్యేల సొంత జాబితాలు..
జిల్లాకు మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు, ఆయాల నియామక ప్రక్రియలో రాజకీయ జోక్యంతో అర్హులకు అన్యా యం జరిగే పరిస్థితులున్నట్టు దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. టీచర్లు, ఆయాల నియామక ప్రక్రియ పూర్తికి ఎంఈవోలు, ఎంపీడీవోలకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. కాగా, గత నెలలోనే దరఖాస్తులను స్వీకరించడంతోపాటు మెరిట్ ప్రకారం జాబితాను సిద్ధం చేసి డీఈవోకు సం బంధిత మండలాల ఎంఈవోలు, ఎంపీడీవోలు అందించినట్టు తెలిసింది. డీఈవో కార్యాలయానికి మెరిట్ జాబితా చేరిన తర్వాత ఎంపిక ప్రక్రియ ముగిసిందనుకున్న తరుణంలో ఎమ్మెల్యేలు మేము ఇచ్చిన జాబితా ప్రకారమే ఎంపిక చేయాలంటూ సంబంధిత అధికారులకు వరుసగా ఫోన్లు చేయడంతో ఎటు తేల్చలేక ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టినట్టు తెలిసింది. ఆయా మండలాల్లోని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారితో స్కూళ్ల వారీగా జాబితాను ఎమ్మెల్యేలు సిద్ధం చేసి ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. మెరిట్ ప్రకారం ఎంపిక చేసిన వారిని నియమించాలా..? ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితా ప్రకారం ఎంపిక చేయాలా? అన్న దానిపై జిల్లా విద్యాశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు మేం చెప్పిన వారినే నియమించాలని ఎమ్మెల్యేలు పట్టుపడుతుండడం అధికారులకు తల నొప్పిగా మారింది.
ఇష్టారాజ్యంగా నియామక ప్రక్రియ..
జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు, ఆయాల నియామక ప్ర క్రియ ఇష్టారాజ్యంగా జరుగుతున్నదనే విమర్శలున్నాయి. టీచర్లకు ఇంటర్, ఆయాలకు ఏడోతరగతి విద్యార్హతగా నిర్ణయించి నియామక ప్రక్రియను చేపట్టారు. టీచర్లకు నెలకు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేలు ఇవ్వనున్నట్టు సమాచారం. టీచర్లు, ఆయాల నియామక ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మాత్రం టీచర్ల విద్యార్హతను ఇంటర్, బీఈడీ ట్రైనింగ్ పూర్తై ఉండాలని నిబంధన పెట్టారు. ప్రభుత్వం కేవలం ఇంటర్ను విద్యార్హతగా నిర్ణయిస్తే జిల్లా విద్యాశాఖ అధికారులు అదనపు విద్యార్హతలను జోడించడం ఏంటని దరఖాస్తు దారులు నిలదీస్తున్నారు.