హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను (Bus Fare Hike) వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నుతూ, పథకం ప్రకారం ఆస్తులను ప్రైవేట్‌పరం చేస్తున్నారని, బస్‌చార్జీలను పెంచుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ సంస్థ హైదరాబాద్ సిటీలో పెంచిన బస్‌చార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్‌భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికుల సాదకబాధలు తెలుసుకున్నారు.
అనంతరం బస్‌భవన్ వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీని ముంచేందుకు కుట్ర చేస్తున్నదని, ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. ‘సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా టికెట్ల ధరలు పెంచడం అన్యాయం. మహిళలకు ఉచిత బస్సును స్వాగతిస్తున్నాం. అయితే కుడిచేత్తో మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చి.. ఎడమ చేత్తో వారి భర్తపై భారీగా భారాలు మోపుతారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి పు రుషుల నుంచి డబుల్ వసూలు చేస్తున్నారు. బస్ టికెట్ ధర పెంచడం దారుణం’ అని మండిపడ్డారు. దీనికి రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
‘కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇచ్చింది.. క్యాబినెట్లో తీర్మానం చేసింది. మీరు దానికి కూడా అపాయింటెడ్ డేట్ ఎందుకు ఇవ్వడం లేదు? వారికి పీఆర్సీ ఇవ్వడం లేదు. వారికిచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడంలేదు’ అనే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు ‘ప్రజాపాలనలో యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. మరి ఎందుకు అమలు చేయడం లేదు? అందుకే ఆర్టీసీ కార్మికులు, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. చేతనైతే సమాధానం చెప్పాలి’ అని సవాల్ విసిరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా నష్టాల్లోనే ఉన్నదని, ఆ నష్టాలను ప్రభుత్వం భరించకుండా.. ప్రజలపై తోసేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ప్రజా రవాణా అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఏడాదికి రూ.1,500 కోట్లు ఆర్టీసీకి ఇచ్చింది. నష్టాల నుంచి బయటపడేసింది. మీరు కూడా అలా ఆలోచన చేయకుండా ప్రజల నడ్డివిరగ్గొడుతున్నారు. దీనిని సహించం. శాంతియుత నిరసనకు ప్రభుత్వం దిగిరాకపోతే తీవ్రస్థాయిలో పోరాడతాం.
‘ఒకవైపు ఫ్రీ బస్సు తెచ్చింది మీరు, మరోవైపు ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టింది మీరు. ఆ నష్టాలను భరించాల్సింది మీరు కాదా? ఆ నష్టాల వంక చూపి ప్రజల నడ్డి విరగ్గొడతామంటే ఎలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మహిళలకు ఫ్రీ ఇచ్చారు. ఇంట్లో విద్యార్థుల బస్‌పాస్ ధర 25% పెంచారు. పురుషులకు డబుల్ చేశారు. దీంతో ఒక కుటుంబానికి 25-35% భారం పెరిగినట్టు కాదా?’ అని ప్రశ్నించారు. ‘మెట్రోను వెళ్లగొట్టారు. ఎల్ అండ్ టీని తరిమికొట్టారు. ఉన్న ఆర్టీసీని కూడా ప్రైవేట్‌పరం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘ప్రజల నడ్డివిరగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం కమీషన్ల కోసం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సంస్థల దగ్గర లాలూచీ పడి ఈ పని చేస్తున్నట్టుగానే అనుమానిస్తున్నాం. మహిళల ప్రయాణానికి ఉచిత బస్సుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు? ఫ్రీ బస్సులను ఏసీ బస్సులకు కూడా అమలుచేయొచ్చు కదా?’ అని కేటీఆర్ ప్రభుతాన్ని నిలదీశారు.
‘కేసీఆర్ హయాంలో కార్గో సేవలను ప్రారంభించారు. ఏడాదికి రూ.వంద కోట్ల ఆదాయం వచ్చేవిధంగా తయారుచేశారు. దానిని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసింది. భవిష్యత్తులో ఆర్టీసీని కూడా ప్రైవేట్‌పరం చేయాలనే కుట్ర కనిపిస్తున్నది’ అని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఆర్టీసీ కార్గోను ప్రైవేట్‌పరం చేసి, ఏడాదికి రూ.వంద కోట్లు వచ్చే సంస్థను నెలకు రూ.3 కోట్లకు అంటే.. మూడో వంతుకే ప్రైవేట్‌కు కట్టబెట్టారు. దీనివల్ల ఎవరికి లాభం? బస్సు డిపోలు అమ్ముతున్నారు. ఆస్తులు తాకట్టు పెడుతున్నారు అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
‘బస్సు చార్జీల పెంపుపై బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజాప్రతినిధులకు లేదా? తెలంగాణలో హకులను కాలరాస్తున్న రేవంత్‌రెడ్డి దుష్టపాలన రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజాప్రతినిధుల హౌస్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు.. ఇదేమి రాజ్యం రేవంత్‌రెడ్డి..?’ అని ప్రశ్నించారు. ‘ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి.. ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావ్. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నావ్. అణచివేతలకు, నిర్బంధాలకు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవరి దగ్గరా డబ్బులు లేవు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు చార్జీలు పెంచితే ఎలా? విద్యార్థులు, సామాన్య ప్రజలు ఎలా బతకాలి? ప్రభుత్వమే నష్టాలు భరించాలి. ఆర్టీసీని విస్తరించండి. ప్రైవేట్‌పరం చేయొద్దు. మేము సహకరిస్తాం.
అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘కమీషన్లు దంచుడు కాదు, పేదల కోసం పని చెయ్యి. నిరసన రాజ్యాంగం ఇచ్చిన హకు. ఆర్టీసీ చార్జీలు పెంచితే మెట్రో ఎకుతారనేది రేవంత్‌రెడ్డిది దుర్మార్గపు ఆలోచన’ అని చెప్పారు. ‘ఆర్టీసీని అమ్మాలని, ప్రైవేట్‌పరం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో పెద్ద కుట్ర జరుగుతున్నది. ఉప్పల్, మియపూర్ వర్షాప్స్ అమ్మకానికి పెటారు’ అని హరీశ్‌రావు విమర్శించారు. బస్స్టాండ్లు కుదవబెట్టి రూ.1,500 కోట్లు తెచ్చారని మండిపడ్డారు. ‘ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమేనా కాంగ్రెస్ పని. కార్గోను అమ్మి ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. చార్జీలు పెంచి పేదల నడ్డివిరుస్తున్నారు’ అని ఆగ్రహించారు. ‘రాహుల్‌గాంధీ.. రాజ్యాం గం గురించి మాట్లాడుతావ్ కాబట్టి ఓ సారి రేవంత్‌రెడ్డి పాలనపై రివ్యూ చెయ్యి. తెలంగాణలో రాజ్యాంగ భక్షణ రేవంత్‌రెడ్డి పాలనలో జరుగుతున్నది’ అని దుయ్యబట్టారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తే సహించ మని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిషరించాలని, ఆర్టీసీ చార్జీలు తగ్గించేవరకు బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుందని ఆయన స్పష్టంచేశారు.
బస్‌భవన్‌లో ఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఆయన ఉదయం, అనుమతి వచ్చిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకొని మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ‘20 నెలల్లో ఐదుసార్లు బస్‌చార్జీలు పెంచారు. భార్యకు ఫ్రీ అని చెప్పి, భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశారు’ అని మండిపడ్డారు. ‘ఇప్పటికే జీవో 53, 54తో కొత్త వాహనాలపై లైఫ్‌ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశారు. వాహన లైఫ్‌టైం ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తాన్ని రేవంత్‌రెడ్డి పీల్చుతున్నారు.
ఇప్పుడు బస్‌చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి దొంగదెబ్బ కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటు మెట్రో రైలును, ఇటు ఆర్టీసీని ఆగం చేశారని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హకు లేదా? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా? ఇది ప్రజాపాలనా లేక ప్రజా పీడననా?’ అని హరీశ్‌రావు నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డి ఏం చేసినా ఎవ్వరూ అడగొద్దు అన్నట్టు ఉన్నది. ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నారు. మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ?’ అని మండిపడ్డారు.
బస్‌భవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు అనంతరం ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, సుధీర్‌రెడ్డి, ముఠాగోపాల్, లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు దేశపతి, సురభివాణిదేవీ భేటీ అయ్యారు. ప్రభుత్వ బకాయిలపై వారు ఎండీని వివరణ కోరగా.. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రూ.1,353 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఎండీ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.9,246 కోట్ల గ్రాంట్‌ను ఆర్టీసీకి విడుదలచేసినట్టు బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు. ‘మెల్లమెల్లగా ప్రైవేటీకరణ వైపు ఆర్టీసీ కార్పొరేషన్‌ను తీసుకపోతున్నారు.
ఒక్కో అడుగు అటువైపే పడుతున్నది. ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్‌వారికి బస్సులు ఇస్తున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు ఏమీ ఉండవు. బస్టాండ్లు వాళ్లకే వెళ్తాయి. లాభాలు వారే తీసుకుంటారు. ఇక ఉద్యోగులకు ఏం మిగులుతుంది’ అని కేటీఆర్ ఆర్టీసీ ఎండీతో వ్యాఖ్యానించారు. ‘నష్టాలు పేరుచెప్పి చార్జీలు పెంచారు. ఇప్పటికే కార్గోను ప్రైవేట్‌కు ఇచ్చారు. ఎలక్ట్రిక్ బస్సులు, స్టేషన్లు ప్రైవేట్‌కు ఇస్తున్నారు. లాభాల్లో ఉన్న ఆర్టీసీని నష్టాలపాలు చేసింది ఎవరు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయబోమని ఆర్టీసీ ఎండీగా మీరు రాసిస్తారా? ప్రైవేటీకరణ జరగబోదని కార్మికులకు హామీ ఇవ్వగలరా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అనంతరం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని కోరుతూ ఎండీకి వినతిపత్రం అందజేశారు.