జయశంకర్ భూపాలపల్లి : డబుల్ బెడ్ రూమ్(Double bedroom houses) ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్(BRS) నాయకులు ఆందోళన చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో లబ్ధిదారులతో కలిసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..సామాన్యుడి సొంతింటి కలను నిజం చేయాలని నాడు కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిందన్నారు.
రూపాయి ఖర్చు లేకుండా ఎంతో మంది పేదలకు ఇండ్లను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 419 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.