BRS Plenary | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో దేశ పాలకులు విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ‘దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం’ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యం అంటే అన్నివర్గాల ప్రజలూ సమాన ప్రతిపత్తితో పరస్పరం గౌరవాభిమానాలతో జీవించే ఉన్నతమైన జీవన విధానం.
ఒక వర్గం ప్రజల్ని అణగదొక్కి వుంచే అధికారం ఎవ్వరికీలేదు. ఏనాటికైనా ఈ కుల వ్యవస్థ రద్దయిపోవాలి. కుల నిర్మూలన దిశగా ప్రయాణించడమే నిజమైన పురోగమనం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దళితుల జీవితాల్లో అలుముకున్న చీకట్లు మాత్రం తొలిగిపోలేదు. తరతరాల సామాజిక వివక్ష నేటికీ కొనసాగుతూనే ఉన్నది. అనాగరికమైన పద్ధతుల్లో దళితుల మీద నేటికీ అవమానకరమైన దాడులు, హింస జరుగుతూనే ఉన్నది. సమానత్వ ప్రపంచాన్ని నిర్మించాలనే భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయం నెరవేర్చడంలో ఇంతకాలం ఈ దేశాన్ని పాలించిన పాలకులు పూర్తిగా విఫలమయ్యారు’ అని విమర్శించారు.
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను ఆదుకునేందుకు ఏ రకమైన కార్యాచరణ రూపొందించలేదు. ఒక్క పథకాన్నీ అమల్లోకి తేలేదు. దేశ జనాభాలో అధికశాతం ప్రజలను దారుణమైన వివక్షతో అణచివేస్తున్నది. బీఆర్ అంబేద్కర్ పేరును వల్లిస్తూ, ఆయన ఆశయాలకు ద్రోహం చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వ హయాంలో దళితుల మీద దాడులు పెరిగిపోయాయి. బీజేపీ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరిని బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తీవ్రంగా ఖండిస్తున్నది. వేల సంవత్సరాలుగా అణగారిపోయిన దళిత సామాజిక వర్గం, మిగతా సామాజిక వర్గాలతో సమానంగా అభివృద్ధిని సాధించాలంటే కొద్దిపాటి సంస్కరణలు సరిపోవు. విశాలదృక్పథంతో ఒక పెద్ద ప్రయత్నం జరగాలె, అది విప్లవాత్మక మార్పుకు దారితియ్యాలే అన్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల.
ఆయన దార్శనిక దృక్పథంలోంచి జనించిన విప్లవాత్మక పథకం తెలంగాణ దళితబంధు. ఆర్తితో పెనుగులాడుతున్న దళితుల చేతికి చాలినంత పెట్టుబడి అందిస్తే వారిలో ఆత్మవిశ్వాసం రెక్కలు విప్పుకుంటుంది. ఆకాశమే హద్దుగా ముందడుగు వేయడం సాధ్యమవుతుందని కేసీఆర్ భావించారు. ఆ ఇచ్చేది కూడా గత ప్రభుత్వాల మాదిరిగా అప్పుగా ఇవ్వకూడదని పూర్తిగా ఉచిత గ్రాంట్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ దళితబంధు పథకం ఫలితంగా రాష్ట్రంలోని వేలాది దళిత కుటుంబాలు స్వావలంబనను సాధించాయి. ఆ విజయ గాథలు దేశవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. తెలంగాణ దళితబంధు నిశ్చయంగా దళిత ప్రజానీకానికి వెలుగునిచ్చు చైతన్యజ్యోతిగా దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నది. దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం దేశ విధాన నిర్ణేతగా బీఆర్ఎస్ అవతరించాలని సభ తీర్మానిస్తున్నది’ పేర్కొన్నారు.