హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో ఆరునెలల వరకు ఎలాం టి ఎన్నికలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. తాజా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చావు తప్పి కండ్లు లొట్టపోయినట్టు ఫలితాలు వచ్చిన నేపథ్యంలో జూన్ దాకా కొత్త ఎన్నికలు వద్దనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు వచ్చినట్టు బయటికి కనిపిస్తున్నా, అధికార పార్టీకి రావాల్సిన స్థాయిలో సీట్లు దక్కలేదని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారట. గ్రామీణ స్థాయిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అంచనాకు మించి పోటీ ఇచ్చిందని ఆందోళన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ గుర్తుల మీద ఎన్నికలు లేవు కాబట్టి బచాయించామని సహచర మంత్రులతో అన్నట్టు తెలిసింది. భవిష్యత్తులో వచ్చేవన్ని పార్టీల గుర్తు మీద జరిగే ఎన్నికలు కాబట్టి పూర్తిస్థాయి కసరత్తు లేకుండా పరిషత్తు ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టు తెలిసింది.
సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ గూబ గుయ్ అనిపించిండ్రు. రేపు కారు గుర్తు కనపడితే సీఎం మైండ్‌బ్లాంక్ అయిపోతది. గుద్ది, గుద్ది ఇడిశిపెడ్తరు జనం. కారు కనపడితే కేసీఆర్ కనపడ్తడు. బీఆర్ఎస్ కనపడ్తది. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎలక్షన్లు ఇప్పట్ల పెట్టే ధైర్యం రేవంత్‌రెడ్డి చేయడు.
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలో శాసనసభ సమావేశాలు పెట్టి అందులో చర్చిస్తం. దాని తర్వాతే ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటం.
మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులకు అప్పగించినా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు వేసి కూర్చోబెట్టినా ఆశించిన ఫలితం రాలేదు. మూడు విడతల్లో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 6,874 మంది, బీఆర్ఎస్ బలపరిచిన వారిలో 3,994 మంది సర్పంచ్‌లుగా విజయం సాధించారని గణాంకాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గెలిచిన స్థానా ల్లో దాదాపు 800 మంది సర్పంచ్‌లు 10 లోపు ఓట్ల మెజారిటీతో గెలిచిన వాళ్లు ఉన్నారు. ఈ లెక్కన ప్రతి పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందించినట్టు తెలిసింది.
2024 జూన్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. దాదాపు 18 నెలల నుంచి ఆశావహులు ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికలు ముగియడంతో గ్రామ శ్రేణి నాయకులు టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తాము సర్పంచ్‌లను గెలిపించుకొని వచ్చామని, ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లు తమకు కేటాయించాలని నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.
అధికారంలోకి వస్తే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. బీఆర్ఎస్తో మిగిలిన పార్టీలు మద్దతు ఇచ్చి బిల్లులకు ఆమోదం తెలిపాయి. అసెంబ్లీ తీ ర్మానం చేసి పంపిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లు అలా ఉండగానే ప్రభు త్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీవోపై కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ వెనకి తీసుకున్నది. అనంతరం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు లేకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది.
ప్రాదేశిక ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగాల్సి ఉండటంతో జాగ్రత్తగానే వెళ్లాలని సీఎం, మంత్రులు అనుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం మార్చి వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాష్ట్ర క్యాడర్‌కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ ఒకరు అభిప్రాయం వ్యక్తంచేశారు. మార్చి తరువాత నిండు వేసవిలో గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని, జూన్, జూలైలో రైతులు, రైతు కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి.. ఆ రెండు మాసాలు కూడా ఎన్నికలకు అనువు కాదని గుర్తుచేశారు. వర్షాలు పడే వరకు ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకపోవచ్చని ఆయన అంచనా వేశారు.