హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారి కన్నా ప్రజలకే బలం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004-06లోనూ అనేకసార్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయాన్ని ఆయన ఎక్స్‌వేదికగా గుర్తుచేశారు. ఇప్పుడే కాదు అప్పుడు కూడా బీఆర్ఎస్ ఇబ్బందులను ఎదుర్కొన్నదని, తమ పార్టీకి కష్టాలు ఎదుర్కోవడం కొత్తకాదని తెలిపారు. నాడు కాంగ్రెస్ పార్టీ నీతిలేని వ్యవహారాలపై తెలంగాణ ప్రజలు ఆందోళనలను ఉధృతం చేశారని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ తల వంచక తప్పలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా ప్రజలు బుద్ధిచెప్తారని, చరిత్ర పునరావృతం అవుతుందని పేర్కొన్నారు.
ఇదేనా రాజ్యాంగ రక్షణ?
పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులు స్వతహాగా అనర్హులయ్యేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ పెద్దమాటలు మాట్లాడారని, కానీ అందుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేనా రాజ్యాంగ రక్షణ? అంటూ ఎక్స్ వేదికగా రాహుల్‌గాంధీని నిలదీశారు. ఫిరాయింపు నిరోధక చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలనే సుప్రీంకోర్టు తీర్పును సైతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఉల్లంఘించారని గుర్తుచేశారు. ఇది రాజ్యాంగ రక్షణా లేక అపహాస్యమా? అని ప్రశ్నించారు. తాము ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.