KTR | నల్లగొండ, జనవరి 28: నల్లగొండ పట్టణం గులాబీ వర్ణమైంది. వాడవాడనా గులాబీ జెండాలు, తోరణాలు రెపరెపలాడాయి. కేటీఆర్ దారిపొడవునా గులాబీ పూల వర్షం కురిసింది. మొత్తంగా కేటీఆర్ రైతు మహాధర్నా విజయవంతమైంది. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ సర్కారును నిలదీసేందుకు నల్లగొండ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు వచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఉమ్మడి జిల్లా రైతాంగం ఘనస్వాగతం పలికింది. ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. తొలుత ఎన్జీ కళాశాల నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. బత్తాయి కాయలతో తయారు చేయించిన భారీ గజమాలను స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కేటీఆర్‌కు వేశారు. రైతులు ఈలలు, చప్పట్లతో కేటీఆర్‌కు స్వాగతం పలికారు.
జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ గులాబీ జెండాలెత్తిన శ్రేణులు, రైతులు నినదించారు. మూడు గంటల పాటు రైతులతో క్లాక్‌టవర్ సెంటర్ ప్రాంగణం కిక్కిరిసింది. ధర్నాకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోర్టు అనుమతి ఇవ్వగా, అంతకుముందే రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు రైతులు ఈలలు, చప్పట్లతో మద్దతు పలికారు. సభా ప్రాంగంలో కూర్చోవడానికి స్థలం లేకపోయినా రైతులందరూ నిలబడడే కేటీఆర్ ప్రసంగం విన్నారు. ఈ సందర్భంగా మానుకోట ప్రసాద్‌తోపాటు పలువురు కళాకారులు కాంగ్రెస్ సర్కార్ విధ్వంసకాండపై పాటలు పాడి ఆలోచింపజేశారు. అంతకు ముందు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి నల్లగొండకు వచ్చే క్రమంలో పట్టణాలు, గ్రామాల్లో కేటీఆర్ రైతుల నీరాజనాలు అందుకున్నారు. చిట్యాలలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి బీఆర్ఎస్ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు.
కేటీఆర్‌ను చూసి చిన్నారుల కేరింతలు
అవధులు లేని ఆప్యాయత.. అభిమానం కేటీఆర్ సొంతమనే విషయం మరోసారి రుజువైంది. రైతు మహాధర్నాకు హైదరాబాద్-విజయవాడ హైవే మీదుగా నల్లగొండకు మంగళవారం ఉదయం బయలుదేరారు. మార్గమధ్యంలో కేటీఆర్ పలువురు అభిమానులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి ఫొటోలు దిగారు. కడపకు చెందిన ఒక కుటుంబంలోని చిన్నారులు వాహనంలో వెళ్తు న్న కేటీఆర్‌ను చూసి చేతులూపుతూ, కేరింతలు కొ ట్టారు. వారి ఉత్సాహాన్ని గమనించిన కేటీఆర్.. కొద్దిదూరంలో రోడ్డుపక్కన తన వాహనం ఆపి చి న్నారులతో, వారి తల్లిదండ్రులతో ఫొటోలు దిగా రు. వాహనం ఆపి మరీ ప్రేమగా పలకరించి అవధులు లేని ఆప్యాయత కనబర్చిన కేటీఆర్‌కు చిన్నారుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.