హైదరాబాద్/మంచిర్యాల, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల అండతో సాగిస్తున్న ఆగడాలను తట్టుకొని బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల వేదికగా సాగిన అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి, క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలపై గులాబీ జెండాను రెపరెపలాడించింది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక సందర్భంగా ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. భయభ్రాంతులకు గురిచేయడం, ప్రలోభాలకు తెరలేపడం వంటి ఎన్ని చర్యలు చేపట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు వెనకి తగ్గలేదు. గులాబీ శ్రేణులు ఐక్యంగా నిలబడి, కుట్రలను ఛేదించి మున్సిపల్ పీఠాలను దకించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకు దిగినా, శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అంతిమంగా ప్రజలు, బీ ఆర్ఎస్ శ్రేణులే విజయం సాధించారు. 50 రోజుల ఉత్కంఠకు తెరదించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కూటమి కైవసం చేసుకున్నది. చైర్మన్‌గా బీఆర్ఎస్కు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్-సీపీఐ కూటమి ద క్కించుకున్నది. అధికార కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేస్తూ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. అధికార మదం తో అరెస్టులు చేయొచ్చు కానీ, ప్రజల మద్దతును ఆ పలేరనడానికి ఈ విజయాలే నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ విజయం పదవుల కోసం కాదని, అధికార అహంకారానికి వ్యతిరేకంగా సాగిన నైతిక విజయమని చెప్తున్నాయి.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 స్థానాలకు గాను బీఆర్ఎస్ 10, సీపీఐ 4, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ ఒకచోట గెలిచారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమి కలిసి 14 సీట్లు గెలిచాయి. సంఖ్యాబలం లేకున్నా మున్సిపల్ పీఠం దక్కించుకోడానికి కాంగ్రెస్ అడుగడుగు నా అడ్డంకులు సృష్టించింది. తొలుత ఫిబ్రవరి 16న నిర్వహించాల్సిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియలో అధికార పార్టీ బరితెగింపు పరాకాష్టకు చేరింది. బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్లు సమయానికి రాకుండా అడ్డుకొని ఎన్నికను వాయిదా వేయించిం ది. మరుసటి రోజు బీఆర్ఎస్, సీపీఐ పార్టీల మహి ళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు అమర్యాదగా వ్యవహరించి, దుశ్శాసన పర్వం సాగించారు. క్యాతన్‌పల్లి ఫ్లైఓవర్‌పైనే బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొ ని, వారిపై లాఠీచార్జి చేయించి, కాంగ్రెస్ నాయకుల తో రాళ్లదాడి చేయించి.. ఉల్టా బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు పెట్టించింది. బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ సహా ఆ పార్టీ నాయకులను జైలుకు పంపింది. మెజారిటీ ఉన్నా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో మూడువారాల్లో ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్, వైస్ చైర్మన్ సీటును సీపీఐ గెలుచుకున్నాయి. ఈ మున్సిపల్ పీఠం దక్కించుకోవడం కోసం దిగజారుడు రాజకీయాలు చేసిన కాం గ్రెస్ చివరకు చేతులెత్తేసింది. ఎంత ప్రయత్నించినా, ఎంతగా ప్రలోభాలకు గురి చేయాలని చూసి నా బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు బలంగా నిలబడ్డారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏడుగురితోపాటు వారికి మద్దతు ఇస్తున్న ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఎవ్వ రూ ఎన్నికకు రాలేదు. బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు 14 మంది వచ్చారు. కోరం ఉండటంతో ఎన్నిక నిర్వహించామని, చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సం ధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి, మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రకటించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరడంతో బాల్క సుమన్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై బాల్క సుమన్ అన్న నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, సుంకె రవి శంకర్, సీపీఐ నాయకులు సీతారామయ్య, కలవేని శంకర్ పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అనేక అడ్డంకులు, కుట్రలు, న్యాయపరమైన చికులను అధిగమించి బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నది. శనివారం జరిగిన ఎన్నికలో మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్ఎస్కు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డి, స్థానిక పొత్తులో భాగంగా వైస్ చైర్పర్సన్ పదవిని బీజేపీకి కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థి ముత్యాల శ్యామల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకుగాను చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు అవసరమైన 13 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణతోపాటు బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఎన్నిక వాయిదా పడేలా చేసింది. కాంగ్రెస్ ప్రలోభాల నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాపాడుకొనేందుకు సుమారు 50 రోజులపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (బంటి) అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రహస్య క్యాంపులో ఉంచి, ఏ ఒకరూ చేజారకుండా పకడ్బందీగా పర్యవేక్షించారు. స్వతంత్ర అభ్యర్థి మురళీకృష్ణతోపాటు బీజేపీ అభ్యర్థి మద్దతును కూడా కూడగట్టడంలో విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి ఒక కౌన్సిలర్ (ఆకుల యాదగిరి) తిరుగుబాటు చేసినప్పటికీ, మెజారిటీ సభ్యులు ఏకతాటిపై నిలబడటంతో విజయం సునాయసమైంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బలం లేకపోయినా పీఠం దకించుకోవాలని చూసిన కాంగ్రెస్, చివరకు బలం సరిపోక ఎన్నికను బహిషరించి కౌన్సిల్ నుంచి వెనుదిరిగింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఉ తంఠ అలాగే కొనసాగుతున్నది. అకడ నెలకొన్న కొన్ని పరిణామాల నేపథ్యంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఆదివారానికి వాయిదా పడింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వ తంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికలకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకీ దక్కలేదు. ఎన్నిక తొలిరోజు ఫిబ్రవరి 16న కోరం లేక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మరుసటి రోజు కొన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. శనివారం మళ్లీ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేయగా, సుమారు 50 రోజులుగా శిబిరాల్లో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కౌన్సిలర్లు ఉదయం 11గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే చైర్మన్ అభ్యర్థిగా బీజేపీ కౌన్సిలర్ అంకం లక్ష్మీమహేందర్కు బీజేపీతోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు (మొత్తం ఏడుగురు) చేతులెత్తి మద్దతు ప్రకటించారు. చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో నైతికంగా అంకం లక్ష్మి చైర్మన్‌గా ఎన్నికైనట్లేనని అందరూ భావించారు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్అఫిషియో సభ్యుడి హోదాలో ఎన్నికల అధికారుల పోడియం వద్దకు చేరుకొని ఎన్నికల ప్రక్రియకు అడ్డుతగిలారు. ఈ ఎన్నిక చెల్లదంటూ తమ పార్టీకి ఏడుగురు సభ్యుల మద్దతు ఉన్నదని, ముందుగా తమ అభ్యర్థి పేరు ప్రకటించాలని మొండివాదనకు దిగారు. ఆల్ఫా బెటికల్ ఆర్డర్లో పేర్లను పిలవాల్సి ఉంటుందని అధికారులు చెప్పినా ఎమ్మెల్యే వినిపించుకోకపోవడంతో వివాదం ముదిరింది. రెండు గంటలకుపైగా చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సంబంధించి హైడ్రామా కొనసాగింది. కార్యాలయంలో ఏం జరుగుతున్నదో తెలియక బయట ఉన్న ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. అకడ కూడా బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. అయితే, ఎన్నికలను అధికార దుర్వినియోగంతో అడ్డుకోవడం, ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించడంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.