రాజన్న సిరిసిల్ల, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. గురువారం 12 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, ఇద్దరు ఇండిపెండెంట్లు, బీజేపీ, కాంగ్రెస్ తరఫున ఒక్కో అభ్యర్థి గెలుపొందారు. గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లలో ఒకరు గుడ్ల సత్యానందం బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారుల సంఖ్య 9కి చేరింది. నేడు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. గెలిచిన వారిలో రాపెల్లి లక్ష్మీనారాయణ (బీఆర్ఎస్), గుడ్ల సత్యానందం (ఇండిపెండెంట్), చొప్పదండి ప్రమోద్ (కాంగ్రెస్), అడ్డగట్ల మురళి (బీఆర్ఎస్), పాటికుమార్ రాజు (బీఆర్ఎస్), బుర్ర రాజు (బీఆర్ఎస్), వేముల సుక్కమ్మ (బీఆర్ఎస్), అడ్డగట్ల దేవదాస్ (బీఆర్ఎస్), ఎనగందుల శంకర్ (బీఆర్ఎస్), వలస హరిణి (ఇండిపెండెంట్), పత్తిపాక సురేశ్ (బీజేపీ), కోడం సంజీవ్ (బీఆర్ఎస్) ఉన్నారు. మొత్తం 12 స్థానాలకు 61 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 4,755 మంది ఓటు హక్కు (77 శాతం)ను వినియోగించుకున్నారు.
అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహం ఫలించింది. ఎన్నికల ముందు రెండు రోజులుగా ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేటీఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో వారికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ఓటమి చెందిన అసహనంతో బీజేపీ నేతలు బీఆర్ఎస్ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసేందుకు యత్నించటం కలకలం రేపింది. గురువారం సాయంత్రం సిరిసిల్ల ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని అభ్యర్థులు బయటకు వచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పార్టీ నాయకులు వారిని కార్లలో ఎక్కించారు. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన, సిరిసిల్ల పట్టణంలోని 12 డివిజన్‌కు చెందిన కోడం సంజీవ్‌ను కిడ్నాప్ చేసేందుకు బీజేపీ నేతలు యత్నించారు. కారులో నుంచి బయటికి లాగి తమ కారులో ఎక్కించుకున్నారు. వెంటనే తేరుకున్న బీఆర్ఎస్ నాయకులు సంజీవ్‌ను తీసుకొని వచ్చి వారి కార్లలో ఎక్కించుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నాయకులు సికిందర్, కల్లూరి మధు తీవ్రంగా గాయపడ్డారు.