హనుమకొండ, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గిరిజన, ఆదివాసీ గూడేలు మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీకే జైకొట్టాయి. నాటి తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఆ వర్గాలన్నీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వస్తున్నాయి. తాజాగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ (Panchayathi Elections) వారంతా గులాబీ పార్టీని అక్కున చేర్చుకున్నారు. తండాలు, ఆదివాసీ గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ వర్గాలకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా అవకాశం ఇచ్చింది. పదేండ్ల పాలనా కాలంలోనూ ఎస్టీల సంక్షేమానికే కేసీఆర్ సర్కారు విశేష ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో తండాలు, ఆదివాసీ ఆవాసాల్లోని అధిక శాతం సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులే గెలుపొందడం విశేషం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో 14 తండా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 7 చోట్ల బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులే సర్పంచులుగా గెలుపొందారు. మహబూబాబాద్ మండలంలో బీఆర్ఎస్ 14 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించింది.
వీటిలో తండాలే 7 ఉన్నాయి. గూడూరు మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలిచారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన వారిలో 8 మంది తండాల సర్పంచులే ఉండటం విశేషం. ఇనుగుర్తి మండలంలో 5 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలిచారు. వీటిలో మూడు తండాలు ఉన్నాయి. మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు, సూర్యాపేట నుంచి ఆసిఫాబాద్ వరకు.. రాష్ట్రవ్యాప్తంగా తండాలు, గిరిజన గూడేల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన వారే సర్పంచులుగా గెలుపొందారు. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, మెదక్, వికారాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి..ఇలా ప్రతి జిల్లాలోనూ అత్యధిక తండాలు, ఆదివాసీ గూడేల ఓటర్లు బీఆర్ఎస్ మద్దతుదారులనే గెలిపించారు. ఇవేకాకుండా ఎస్టీలకు రిజర్వ్ అయిన ఇతర పంచాయతీల్లోనూ బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన అభ్యర్థులే అధికంగా గెలుపొందారు.
యాదికొచ్చిన సంక్షేమం
పేదలు ఎక్కువగా ఉండే ఎస్సీ, ఎస్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఈ వర్గాల అభ్యున్నతి కోసం దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధి(ఆర్థిక వనరుల ప్రణాళిక, కేటాయింపు, వినియోగం) చట్టం-2017ను 2017 మార్చి 14న బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించింది. గిరిజన తండాలు, ఆదివాసీ ఆవాసాలను ఆ వర్గాలే పాలించుకునేలా కేసీఆర్ ప్రభుత్వం విప్లవాత్మక విధానం తెచ్చింది. అప్పటి వరకు గ్రామాల్లో ఓ వార్డుగా ఉండే తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఆనాటి సర్కార్ మార్చింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. తండాలు, ఆదివాసీ ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ 2018 మార్చి 28న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చింది. ఈ చట్టంలో భాగంగా నూరుశాతం ఎస్టీ జనాభా ఉన్న ఆవాసాలు 1,326 గ్రామ పంచాయతీలుగా మారాయి. వీటిలో షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీలు 1,311 ఉన్నాయి. బీఆర్ఎస్ తెచ్చిన ఈ చట్టంతో ఎస్టీలకు స్థానికంగా సొంత పరిపాలనా నినాదం సాకారమైంది. ఎస్టీలకు పూర్తిగా కేటాయించిన వాటితోపాటు ఇతర గ్రామ పంచాయతీల్లోనూ ఈ వర్గాలకు రిజర్వేషన్ అవకాశం ఉండటంతో 2019 పంచాయతీ ఎన్నికల్లో 3,042 స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022 సెప్టెంబరు 30న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.