కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 26: అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలుచుకొని బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా ముఖ్యమైనవని, ప్రజలు విపక్షాలను తుక్కు తుక్కుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నదని తెలిపారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటున్నా ప్రజలు వారి మాటలను నమ్మడం లేదని చెప్పారు. ఉపాధి కోసం వలసపోయిన వారందరూ ఇప్పుడు గ్రామాలకు వచ్చి పనులు చేసుకుంటున్నారని, హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థల్లో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడం వల్ల ఫ్యాక్టరీలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయని, ఉత్పత్తి పెరిగిందని వివరించారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని, బీజేపీ ఎప్పుడో చేతులు ఎత్తేసిందని జోస్యం చెప్పారు. 60 స్థానాల్లో కాంగ్రెస్ తమకు దరిదాపుల్లో కూడా లేదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి సీఎం అవుతామని చెప్పుకుంటున్న అభ్యర్థులు కూడా ఓడిపోనున్నారని తెలిపారు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టాలన్నప్పుడే రేవంత్‌రెడ్డికి వ్యవసాయం అంటే ఏంటో తెలియదని ప్రజలకు అర్థమైందని వివరించారు. గోదావరిపై కాంగ్రెస్, టీడీపీ 60 ఏండ్లలో ఒక్క ప్రాజెక్టు మాత్రమే కట్టాయని, కేవలం పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ప్రాజెక్టులు నిర్మించిందని తెలిపారు.
ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక్క పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వేలైన్ మంజూరు చేయించి ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించామని గుర్తు చేశారు. మధ్య మానేరులో రెండు కిలోమీటర్ల మేరకు రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జిని తెలంగాణ యువత గర్వపడే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు చేశామని వివరించారు.
ఎంపీగా గెలిచిన నాయకులు ఇలాంటివి ఆలోచన చేయాలని సూచించారు. కానీ, బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో తాను ఎంపీగా స్ట్రీట్ లైట్లు పెట్టించానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల కోసం యువత మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని హితవుపలికారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు. గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో ఈ పదేండ్ల కాలంలో 1.64 లక్షలు ఉద్యోగాలు కల్పించామని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ట్రస్మా నాయకుడు శేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.