వరంగల్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు నిజాలు చెప్పి వాళ్ల మోసాలను ఎండగట్టాలని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్లవి ఉద్దెర మాటలేనని, ఉద్ధరించేవి కావని ప్రజలకు అర్థమైందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం, పరిపాలన మరిచి ప్రతిరోజు లీకు వార్తలు, ఫేకు వార్తలతో కాలం గడుపుతున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలు, హామీలను నాలుగు నెలలైనా అమలు చేయడంలేదని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు వేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలైనా ఇప్పటికీ పూర్తి చేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనతోనే మళ్లీ రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయనని, బోరుబండ్లు, బావుల పూడికతీతలు వచ్చాయని వెల్లడించారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో నిర్వహించిన వరంగల్ లోక్‌సభ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘రెండు లక్షల రుణమాఫీ, పింఛను పెంపు, రైతుబంధు పెంపు, వడ్లకు బోనస్, మహిళలకు రూ.2,500 ఇలా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక హామీ అమలు కాలేదు. ఈ హామీలు అమలైన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయండి, కానివాళ్లు బీఆర్ఎస్కు ఓటేయండి. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు. కష్టాలు మనకు కొత్తకాదు.
రేవంత్ నాయకులను కొనగలిగినా, ఆత్మగౌరవమున్న ఉద్యమ నాయకులను కొనలేడు. వంద రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం అని రేవంత్ అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే రూ.4 వేల పెన్షన్, మహిళలకు రూ.2,500, ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇయ్యకున్నా ఓటేశారని వాటిని పూర్తిగా బంద్ చేసే ప్రమాదం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నీలం తుఫాన్ వస్తే కృష్ణా, గుంటూరుకు నష్ట పరిహారం ఇచ్చారు.
నష్టం జరిగిన వరంగల్, ఖమ్మం జిల్లాలను మాత్రం పట్టించుకోలేదు. అప్పుడు పదవుల కోసం పెదవులు మూసుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సమైక్య రాష్ట్రంలోనే బాగుండేదని ఈ రోజు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ల నిజ స్వరూపం బయటపడింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇంకా గట్టిగా కొట్లాడుతం. హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. ప్రశ్నించే బలాన్ని మాకివ్వాలి.
కాంగ్రెస్ వచ్చాక ముస్లిం సోదరులకు తోఫా(కానుక) బంద్ అయ్యింది. మైనారిటీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల బడ్జెట్లోనూ అన్యాయం చేసింది. బీఆర్ఎస్ పని అయిపోయిందని అంటున్నారు. కానీ, తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ పాలపొంగు అని మాట్లాడిన టీడీపీనే తెలంగాణలో లేకుండా పోయింది.
కేసీఆర్ పొలం బాట కార్యక్రమానికి అద్భుత స్పందన వస్తున్నది. ఆరు నూరైనా, అటు సూర్యుడు ఇటు పొడిచినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదు. దానికి ఓటు వేయడం వృథా. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ను గెలిపించాలి’ అని కోరారు.
కడియంకు గుణపాఠం చెప్పాలి
కడియం శ్రీహరి పోయిన తర్వాత పార్టీలో జోష్ కనిపిస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. పదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని బీఆర్ఎస్కు ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తున్నదని చెప్పారు. ‘కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఏం తకువ చేసింది? ఉపముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. అన్ని ఇచ్చిన బీఆర్ఎస్కు కడియం శ్రీహరి జీవితాంతం రుణపడి ఉన్నా తకువే. పార్టీ మారేదేలేదని చెప్పి ఎందుకు మారాడో సమాధానం చెప్పాలి.
ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? కష్టపడే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుంది. ద్రోహం చేసినవాళ్లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదు. వరంగల్ తొలి నుంచి ఉద్యమాల గడ్డ. బీఆర్ఎస్కు అండగా ఉన్నది. ఇక్కడి కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తకువే. వరంగల్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంతో కృషి చేసింది. ఐదు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టెక్స్టైల్ పార్కును తెచ్చాం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలో కాకతీయ తోరణాన్ని తీసేస్తామని అంటున్నారు. అదే జరిగితే వరంగల్ అగ్నిగుండం అవుతుంది. కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక’ అని పేర్కొన్నారు. సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, శాసనమండలి వైస్ చైర్మన్ బండాప్రకాశ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణరెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్‌రాజుయాదవ్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
జోడీ లేకపోతే ఈడీ.. ఇదే బీజేపీ తీరు
పదేండ్ల పాలనలో బీజేపీ ఒక్క పని చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. ‘ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు బీజేపీ కూడా వస్తున్నది. బీజేపీ మాట వింటే జోడీ కడుతుంది. వినకపోతే ఈడీని ఉసిగొల్పుతుంది. పదేండ్ల పాలనలో బీజేపీ ఒక మంచి పనిచేసిందా? అని ఆ పార్టీ కార్యకర్తలను అడగండి. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై మన కార్యకర్తలు వంద చెప్తారు. బీజేపీ హయాంలో దేశంలో ఆకలి, నిరుద్యోగం పెరిగింది. కాంగ్రెస్, బీజేపీ ఒకటే. మేం బీజేపీతో చేతులు కలిపితే కవిత ఎందుకు జైలుకు వెళ్తుంది. రాముడిని మనం కూడా మొకుతాం. హనుమాన్ చాలీసా నేను చదువుతా. బీజేపీ వాళ్లకు వస్తుందో లేదో? దేవుడు అందరివాడు. కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. యాదాద్రి లడ్డూను మనం ఇంటింటికి పంచలేకనా? దేవుడిపై రాజకీయాలు మంచిది కాదు’ అని తెలిపారు.