ECI | బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందానికి ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్వనీ కుమార్ మోహల్ లేఖ పంపారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా సైతం బీఆర్ఎస్ అధినేతకు సమాచారం అందించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఢిల్లీకి వెళ్లనున్నది. ఈ బృందంతో పార్టీ సీనియర్ నేతలతో పాటు, ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎంపీలు సభ్యలుగా ఉండనున్నారు.
రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత కేఆర్ సురేశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ బృందంలో సభ్యులు. సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సంస్కరణలు, వివిధ పార్టీలు సమర్పించిన వినతులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర కీలక అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బిహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) డ్రైవ్‌పై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. ఈ క్రమంలోనే ఈసీ సమావేశం నిర్వహించనుండడం గమనార్హం. ప్రస్తుతం సర్ అంశంపై ప్రతిపక్షం కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ లోక్‌సభ, రాజ్యసభను స్తంభింపజేస్తున్నాయి.