Telangana | హైదరాబాద్ /ఖమ్మం/ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలం గాణ) : అనుకోని విపత్తుతో ఆగమైపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ బంధువుగా నిలచింది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే తిరుగుతూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఆపదగొన్నవారిని ఓదారుస్తూ సర్వం కోల్పోయినవారికి నిత్యావసర సరుకులు అందిస్తూ ముందుకు సాగుతున్నారు.
భారీ వర్షాలు ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాలను అతలాకుతలం చేశాయి. ఆయా ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చినమేరకు ముఖ్యనేతలు సహా కార్యకర్తలు సైతం కదిలారు. వరదబాధిత ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు ఖమ్మం, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు నేతలు వదర బాధితుల పరామర్శకు వెళ్లారు. పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజాప్రతినిధులే కాకుండా పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు సహాయ చర్యల్లో మమేకమవుతున్నారు.
ఖమ్మం కరుణగిరి రాజీవ్ గృహకల్ప, వేంకటేశ్వరనగర్, కాలువొడ్డు, బొకలగడ్డ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రులు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు వరద బాధితులను పరామర్శించారు. పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తమ వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతల ఎదుట బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఖమ్మం వెంకటేశ్వరనగర్ కాలనీలో కిరాణా దుకాణ యజమాని బసవేశ్వరరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ‘వరద నష్టం రూ.8 లక్షల వరకూ ఉంటుంది. మమ్ములను ఆదుకోండయ్యా’ అని వారు వేడుకున్నారు. అక్కడి నుంచి బురదలోనే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతుండగా తల్లాడ మండలానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికులు ఎదురుకాగా, వారితో హరీశ్‌రావు ముచ్చటించారు. అక్కడి నుంచి ఉగ్గుబాలకృష్ణ – రాజ్యలక్ష్మి ఇంట్లోకి వెళ్లి బురదలో ఉన్న దుస్తులు, సామగ్రిని పరిశీలించారు. రాజ్యలక్ష్మి భుజాన సబితా ఇంద్రారెడ్డి చేయివేసి ఓదార్చారు. ఖమ్మంరూరల్ మండలం రాజీవ్ గృహకల్ప కాలనీలో బీఆర్ఎస్ నాయకులు గంటన్నరపాటు పర్యటించారు. తమ ప్రాంతాలకు ముఖ్యమంత్రి వచ్చి కనీసం పలకరించలేదని వాపోయారు. వరదల్లో సర్వం కోల్పోయామని, కట్టుబట్టలతో రోడ్డుమీద పడ్డామ ని, తినడానికి తిండి, తాగేందుకు నీళ్లు లేవని కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని వాపోయారు. ఎవ్వరూ మనోధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వ మెడలు వంచి సాయం అందించే విధంగా కృషి చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రదేశాన్ని హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శంభీపూర్‌రాజు, వివేకానంద, కౌశిక్‌రెడ్డి, గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు లు తమకు జరిగిన నష్టాన్ని బీఆర్ఎస్ బృం దం దృష్టికి తెచ్చారు. ఖమ్మం జిల్లా మంత్రులు నీళ్లు తీసుకుపోయేందుకు కట్టమీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డిం గ్ చేసి నీళ్లు పోకుండా చేశారని, కనీసం ఆ వెల్డింగ్ను తొలగించకే తమ పొలాలకు వరద వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. మున్నేరు వరదకు సర్వం కోల్పోయిన బాధితులకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవరాల్లోని పలు ప్రాంతాలవారికి సరుకులు చేరవేశారు.
వరద ముంపుతో మూడు రోజుల నుంచి అరిగోస పడుతున్నాం. ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు చూడటం లేదు. సీఎం సార్ ఇక్కడికి వచ్చి కనీసం మా వంక చూడకుండా వెళ్లిపోయిండు. ఈ ప్రభుత్వంలో మాకు ఏమాత్రమూ న్యాయం జరగడం లేదు. కనీసం వండు కోవడానికి కూడా సరుకులు లేవు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్వయంగా ట్యాంకర్ పంపించారు. ప్రభుత్వం ఉన్నాట్టా? లేనట్టా? సీఎం జీపులో ఇంటి ముందుకొచ్చి వెళ్లాడే తప్ప ఎట్లున్నరని కూడా మాట్లాడలేదు.