Independence Day | భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్య్ర ఫలాలు చివరి గడపకూ చేరిన నాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుందని అన్నారు. మహాత్మా గాంధీ నడిపించిన భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో శాంతియుత మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, ప్రజల సహకారంతో పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో సబ్బండ వర్గాల అభ్యున్నతి దిశగా దేశ పాలకుల కార్యాచరణ మరింత చిత్తశుద్ధితో అమలుచేసి ఫలితాలు సాధించడం ద్వారా మాత్రమే స్వాతంత్ర్య పోరాట త్యాగధనులకు మనం అర్పించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.