BRS Party | హైదరాబాద్ : ఎర్రగడ్డ డివిజన్, శాస్త్రీ నగర్లో దాడికి గురైన నిరుద్యోగ జేఏసీ నేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్వీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగ బాలు కలిసి పరామర్శించారు. అనంతరం నిరుద్యోగ జేఏసీ నేతలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సనత్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తమ హక్కుల కోసం, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతున్న నిరుద్యోగ జేఏసీ నేతలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. యూత్ డిక్లరేషన్ల పేరుతో తమకు ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీస్తున్నారన్న అక్కసుతో నిరుద్యోగ జేఏసీ నేతలపై భౌతిక దాడులకు తెగబడటం అత్యంత నీచమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం, ఓటర్లను చైతన్యం చేయడం వారి హక్కు. ఉన్నత విద్యావంతులైన ఆ యువత పై కాంగ్రెస్ గుండాగిరి చేయడం ప్రభుత్వ అసమర్థత చేతకానితనానికి నిదర్శనం. శాంతి భద్రతలకు వీలైన ప్రతీ చోట బొంద పెడుతున్న హోం శాఖ తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం రావడానికి కారణమైన ఆ నిరుద్యోగ నిప్పు కణికలతో పెట్టుకుంటున్నావ్. నీ ఉద్యోగం వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలతో ముడిపడి ఉందని మర్చిపోవద్దు తస్మాత్ జాగ్రత్త అని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
