BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభం, రైతుల కష్టాలపై చర్చ జరపకుండా, తమకు అనుకూలమైన ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడి సభను ముగించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజల కష్టాలు, రైతుల సమస్యలపై చర్చించడానికి కనీసం 15 రోజుల పాటు లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు అసెంబ్లీ నిర్వహించినా చర్చలో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరిగితే తమ అసమర్థత, అంతులేని నిర్లక్ష్యం బయటపడుతున్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గన్‌పార్క్ దగ్గర యూరియా కోసం బీఆర్ఎస్ చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, వ్యవసాయ సంక్షోభం నుంచి మొదలుకొని, ఆరు గ్యారెంటీల వైఫల్యం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు ఏ అంశంపైనైనా చర్చకు మేము సిద్ధం. ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం చెబుతాం,” అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క రోజూ ఎరువుల కొరత కాని, రైతులు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి తలెత్తలేదన్నారు. కాని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు తమ చెప్పులు, ఆధార్ కార్డులను లైన్లలో పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
పండుగ రోజు కూడా రైతులు వర్షంలో తడుస్తూ ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఎందుకు దాపురించిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 600 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న కేటీఆర్, 75 లక్షల మంది రైతులు అవస్థల్లో ఉన్నారన్నారు. పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, భారీ వర్షాలతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి గానీ సుదీర్ఘంగా చర్చించే అవకాశం అసెంబ్లీలో ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభం పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో తమకు మాట్లాడే అవకాశం ఇస్తే వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా తాము స్పష్టమైన సమాధానం చెబుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై వేసింది పీసీ ఘోష్ కమిషన్ కాదన్న కేటీఆర్, అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న ‘పీసీసీ ఘోష్ కమిషన్ అని ఎద్దేశా చేశారు. ఇక అసమ్మతి ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు.
అంతకుముందు రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర యూరియా సంక్షోభం, రైతుల గోసపై భారత రాష్ట్ర సమితి సమరశంఖం పూరించింది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శాసనసభ లోపల, వెలుపల ఆందోళనలతో హోరెత్తించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద ఖాళీ యూరియా బస్తాలతో వినూత్న నిరసన తెలిపారు. అనంతరం వ్యవసాయ కమిషనరేట్‌ను ముట్టడించి, ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేటీఆర్ నాయకత్వంలో గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఖాళీ యూరియా బస్తాలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా”, “రేవంత్ దోషం.. రైతన్నకు మోసం”, “రైతులను రోడ్లపై నిలబెట్టిన కాంగ్రెస్ సర్కార్ నశించాలి” అంటూ నినదించారు. పండుగ పూట కూడా రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు.
గన్‌పార్క్ దగ్గర నిరసన తరువాత కేటీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ నుంచి ర్యాలీగా బయలుదేరి వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు, రైతులకు ఎరువులు సరఫరా చేసే వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.