హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): బడుగులకు ఆది నుంచీ బీఆర్ఎస్ గొడుగుపడుతూనే ఉన్నది. వెనుకబడిన కులాలను వెక్కిరింతలకు గురిచేస్తే కాంగ్రెస్ సర్కార్‌ను వెంటాడుతామని హెచ్చరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీ వర్గాలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధిలేదని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. రేవంత్ సర్కార్ చేసిన ఘనకార్యాన్ని దేశానికే ఆదర్శమని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తూర్పారబట్టారు.
తెలంగాణ బీసీ వర్గాల గొంతుకగా బీఆర్ఎస్ నిలుస్తుందని కేటీఆర్ రాహుల్‌గాంధీకి ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ బీసీ వర్గాలకు రాహుల్‌గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ ఏడాదికాలంగా ఊదరగొట్టి అసమగ్ర, అశాస్త్రీయ సర్వేచేసి బీసీలకు ద్రోహం చేసిందని లేఖలో మండిపడ్డారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్ సహా ఎమ్మెల్యేలు బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకవైపు మీడియా సమావేశాలు, మరోవైపు క్షేత్రస్థాయి నిరసనలు చేపట్టారు.
సర్కార్‌పై బీసీ సంఘాల సైరన్
కాంగ్రెస్ సర్కార్ తీరును తెలంగాణవ్యాప్తంగా బీసీ సంఘాలు, బీసీ మేధావులు తీవ్రంగా నిరసిస్తున్నాయి. బీసీ కులగణన చేపడతామని, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ ఏడాది తర్వాత అసెంబ్లీ సాక్షిగా వంచిందని మండిపడుతున్నారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేయే శాస్త్రీయంగా ఉన్నదని, రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా తమ సంఖ్యను గణనీయంగా తగ్గించి తీరని అన్యాయం చేసిందని బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీసీల పక్షపాతి అని, కేసీఆర్ సర్కార్ చేపట్టిన బీసీల అభ్యున్నతి కోసం అమలుచేసిన కార్యక్రమాలను బీసీ సంఘాల ప్రతినిధులు ఉదహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాన్ని ఆశించిన కాంగ్రెస్ సర్కార్ తమను ఏమార్చిందని, అవే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పక తప్పదని బీసీ సంఘాలు హెచ్చరించాయి.