BRS Party | బంజారాహిల్స్, మార్చి 24 : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించి ఎన్నికల్లో పంచాడంటూ కేంద్రం మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్‌తో పాటు పలువురు నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కిషోర్ గౌడ్, మన్నె గోవర్థన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ ఆదివారం బీజేపీ ఆఫీసులో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌ను ఉద్దేశించి బీదర్‌లో దొంగ నోట్లు ప్రింటింగ్ చేసే మిషన్ ఉందంటూ చేసిన ఆరోపణలు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలా ఉన్నాయన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. తాను కేంద్రమంత్రి అనే విషయం మర్చిపోయి ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్ తీరు సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు డా. కుర్వ విజయ్ కుమార్, అశ్విన్ రావు, తదితరులు పాల్గొన్నారు.