V Prakash | హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాష్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డివి అజ్ఞానపు మాటలు అని ధ్వజమెత్తారు. అమెరికా పర్యటన సందర్భంగా ఉచితాల గురించి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ధరణి ఎత్తేస్తామని కొద్ది రోజుల క్రితం అన్నాడు.. దాంతో రాష్ట్ర రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు అజ్ఞానంతో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందన్నాడు. కానీ 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాంగా తెలంగాణ రైతులు ఎదిగారని ప్రకాశ్ తెలిపారు.
24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకాశ్ గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు ఉచిత విద్యుత్ అవసరం లేదని అపరిపక్వ మాటలు మాట్లాడం కరెక్ట్ కాదు. రేపు రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధును కూడా వద్దంటాడు ఈ రేవంత్ అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని వీ ప్రకాశ్ డిమాండ్ చేశారు.