హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు సకాలంలో చెల్లించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. ఈ పథకం పరిధిని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు, అర్బన్ ప్రాంతాల్లో అత్యవసర అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణకు విస్తరించాలనే ఆలోచన కేంద్రానికి ఉన్నదా? అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్జ్యోతి సమాధానం ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, పెండింగ్ వేతనాలను సకాలంలో చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.