హైదరాబాద్, మార్చి 18 (నమస్తేతెలంగాణ): శాసనమండలి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉన్నదని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక, పట్టణ సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచే ప్రక్రియలో తమిళనాడు విధానం పాటించి ఉంటే శాస్త్రీయంగా ఉండేదని సూచించారు. అంబశంకర్ నేతృత్వంలోని ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్‌తో సమగ్రంగా డోర్ టు డోర్ సర్వేను తమిళనాడు ప్రభుత్వం చేయించిందని చెప్పా రు. ఆ డేటాను న్యాయస్థానాలు తప్పు పట్టలేకపోయాయని తెలిపారు. అదే పద్ధతిని ఇక్కడ పాటిస్తే బాగుండేదని పేర్కొన్నారు. కా నీ అలా చేయకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించడం వల్ల గణాంకాల్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయంపై అనుమానాలకు ఆస్కారం ఏర్పడిందని మధుసూదనాచారి వెల్లడించారు.
స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల పెంపుపై కమిషన్ల నియామకంలో కూడా పొరపాట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. వారం రోజుల్లోనే విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుపై సమగ్ర అధ్యయనం చేసి కమిషన్ నివేదిక సమర్పించడం సాధ్యమా? దాన్ని ఆధారంగా రూపొందించిన చట్టానికి న్యాయపర చిక్కులు ఏర్పడవా? అని ప్రశ్నించారు. ఇలాంటి అనేక లోపాలను ప్రభుత్వం సరిచేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని మధుసూదనాచారి వెల్లడించారు. గతంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అమలు చేయలేదని మధుసూదనాచారి విమర్శించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి విషయంలో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.