హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మండలిలో ఖాళీ కానున్న ఐదు స్థానాలకు ఐదుగురే నామినేషన్ వేశారు. ఈ ఎన్నికలకు గత నెల 25వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థుల విజయం ఏకగ్రీవం అయినట్టు అధికారులు ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, తేజావత్ శంకర్‌నాయక్, మిత్రపక్షమైన సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఏకగ్రీవంగా గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వారికి వెంటనే అసెంబ్లీ ప్రాంగణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ధ్రువపత్రాలను సైతం అందజేశారు. ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరి స్థానంలో కొత్తగా ఎన్నికైనవారు త్వరలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నల్లగొండ ఉద్యమానికి దక్కిన గౌరవం: పల్లా ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యం ఎన్నిక కావడం ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి దకిన గౌరవమని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి కొనియాడారు. నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో రైతులు, కార్మికుల సమస్యల పరిషారం కోసం నెల్లికంటి సత్యం కృషి చేయాలని సూచించారు.