Balka Suman | మంచిర్యాల : రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన కొనసాగుతుంది అని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పట్టణ ప్రధాన కార్యదర్శి గడప రాకేష్‌ను బాల్క సుమన్ పరామర్శించారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. పగలతో, కక్షలతో కూడిన పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. రాకేష్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించిన గుండాలను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హత్య రాజకీయాలపై కాకుండా జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. కార్యకర్తలను కడుపున పెట్టుకొని కాపాడుకుంటాం. వారి జోలికి వస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని బాల్క సుమన్ తేల్చిచెప్పారు.