హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ తప్పుడు కథనాలను ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్టీవీ నెట్వర్క్, రవిప్రకాశ్‌పై బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ చేసింది. పార్టీ, పార్టీ అధినేత కేసీఆర్‌పై, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను ప్రచురించినందుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించి, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే రీతిలో ఆర్టీవీ అసత్యకథనాలను ప్రసారం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. 2014 నుంచి 2023 దాకా తెలంగాణను కేసీఆర్ దేశానికే దిక్సూచిగా నిలిపారని, ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై బీఆర్ఎస్ చేసిన పోరాటాన్ని లీగల్ నోటీసులో ప్రస్తావించింది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ప్రాణప్రదంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీని, పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను ఆర్టీవీ దిగజార్చిందని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ నిరాధారమైన కథనాలను ప్రసా రం చేసిందని ధ్వజమెత్తింది. ఆర్టీవీ నెట్వర్క్, రవిప్రకాశ్ ఐదు రోజుల్లో క్షమాపణ చెప్పి, ఆ నెట్‌వర్క్‌లో ఉన్న తప్పుడు కథనాల లింకులను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.