హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నైతిక విజయం తమ పార్టీదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ స్పష్టంచేశారు. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ఎన్నికల వ్యవస్థలను వాడుకుని కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన వేలాది మందితో వేయించిన దొంగ ఓట్లతోనే అది గెలిచిందని చెప్పారు. పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నేతలు తమ సైన్యంగా మార్చుకున్నారని పేర్కొన్నారు.
ఇన్ని అడ్డంకులున్నా బీఆర్ఎస్ పార్టీకి 39 శాతం ఓట్లు రావడం విశేషమేనని తెలిపారు. గత రెండేండ్లలో ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ సమర్థంగా ప్రజల్లో ఎండగట్టిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, ఉప ఎన్నికలో ప్రచారాస్త్రంగా మలిచామని తెలిపారు. గణనీయంగా ప్రజల మద్దతు పొందడంతోపాటు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ అని ప్రజలు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం సర్కారుపై పోరు కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి ప్రజలు తాత్కాలిక ఉపశమనం కల్పించారని తెలిపారు.