BRS | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో ఇంటింటా ‘గులాబీ పండుగ’ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, పార్టీ నిర్మాణం ఏకకాలంలో జోరుగా సాగుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కోసం వెళ్లే బీఆర్ఎస్ బృందాలకు మహారాష్ట్ర వాసులు తమ ఇండ్ల ముందు ‘భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయీ భవ’ అని ముత్యాల ముగ్గులతో స్వాగతం పలుకుతున్నారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ఈనెల 22 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల నిర్మాణం ప్రారంభమైంది. మహారాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో అన్ని నియోజకవర్గాల్లోని గులాబీ శ్రేణులు తలమునకలయ్యాయి. ప్రతీ నియోజకవర్గంలో రోజుకు నాలుగు నుంచి 5 గ్రామాల చొప్పున సభ్యత్వ నమోదు, పార్టీ గ్రామ కమిటీలు, 9 అనుబంధ కమిటీల నిర్మాణం చేపట్టాలని పార్టీ నిర్దేశించుకున్నది.
ఊరూరా పండుగలా
అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్, సమన్వయకర్త మరో ముగ్గురు ఇలా ఐదుగురు సభ్యుల్లో ఒకరు సభ్యత్వ ఫార్మాట్‌కు అనుగుణంగా ఫాం నింపి, దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. మిగితా సభ్యులు మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ ఆవశ్యకతను వివరించటం, మహారాష్ట్రకు తెలంగాణ మాడల్ ఎందుకు అవసరమన్న విషయంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. గ్రామస్థుల్లో ఉత్సాహవంతులైన యువకులు, రైతులు, రైతుకూలీలు, మహిళలతోపాటు పలు సామాజిక సంస్థల ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం పేర్కొన్నారు.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మహారాష్ట్ర ప్రజల మనసులను గెలిచిందని, సీఎం కేసీఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పార్టీ సభ్యత్వం, పార్టీ నిర్మాణం వేటికవే సాగుతున్నాయని చెప్పారు. సభ్యత్వాలన్నీ ఎప్పటికప్పుడు ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయానికి అనుసంధానం అయిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 25 వేల సభ్యత్వాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, రానురాను వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.