BRS | వరంగల్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పద్నాలుగేండ్ల ఉద్యమప్రస్థానం.. పదేండ్ల పాలన మేళవింపు.. ఏడాదిన్నరగా మళ్లీ ఉమ్మడి పాలన నాటి ఆనవాళ్ల నడుమ తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానున్నది. లక్షలాది మందితో జరిగే రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హనుమకొండ జిల్లాలోని మండల కేంద్రమైన ఎల్కతుర్తి ఈ మహాసభకు వేదిక అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది జనాలు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండే ఎల్కతుర్తిని మహాసభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ మహాసభ ఏర్పాట్లలో ఇప్పటికే నిగమ్నమయ్యారు.
రజోత్సవ మహాసభ వేదిక, బహిరంగసభ, పార్కింగ్, ప్రజలకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు వేగంగా ప్రణాళిక రూపొందింది. 60 ఏండ్ల ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది. 2014 నుంచి పదేండ్ల సుపరిపాలనతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపింది. 14 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల సుపరిపాలన మేళవింపుగా ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వేదికగా ‘బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ’ జరుగుతున్నది. భారీ బహిరంగసభలు అంటేనే బీఆర్ఎస్ అని దేశ రాజకీయాల్లో ఒక నానుడి ఉన్నది. స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా సాగిన ఉద్యమ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ ఎన్నో భారీ బహిరంగసభలను నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగసభలు ప్రపంచ రికార్డులను నమోదు చేశాయి. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సైతం అంతేస్థాయిలో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఎల్కతుర్తిలోని 1,213 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల వాహనాలు వస్తాయనే అంచనా ఉన్నది. దీనికి అనుగుణంగా 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ వేదిక సిద్ధమవుతున్నది.
రోడ్ల కూడలి.. ఎల్కతుర్తి
లక్షలాదిగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేలా వరంగల్ నగర సమీపంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీనికి కొనసాగింపుగా వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు అనువైన స్థలాలను పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు రోడ్డుమార్గంలో అనుసంధానమయ్యే రెండు జాతీయ రహదారుల జంక్షన్ అయిన ఎల్కతుర్తి పట్టణాన్ని మహాసభకు అనువైన స్థలంగా గుర్తించారు. రెండు జాతీయ రహదారుల కూడలికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఎల్కతుర్తిలో 1,200 ఎకరాలకు పైగా స్థలం ఉన్నది. విశాలమైన స్థలం, రవాణాపరంగా అనుకూలంగా ఉండటంతో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ఎల్కతుర్తి వేదిక అవుతున్నది.