Greater Hyderabad | రాష్ట్రమంతా ఒక లెక్క! గ్రేటర్లో మరో లెక్క. అసెంబ్లీ ఎన్నికల దంగల్ మొదలు కాకముందే గ్రేటర్ హైదరాబాద్ రాజకీయ ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. కారు జోరు చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వాళ్లది. పదేండ్ల నగరాభివృద్ధికే జనం జై కొడుతుండటంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీ చేసేందుకు జంకుతున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. అభ్యర్థులు దొరక్క ఆ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అందుకే ఆ రెండు పార్టీల మొదటి జాబితాల్లో నగరంలోని ప్రధాన నియోజకవర్గాలకు చోటు దక్కలేదు. హైదరాబాద్ పరిధిలో 28 స్థానాలకు గానూ కాంగ్రెస్ 16 మంది.. బీజేపీ 10 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించాయి. విపక్షాలకు అభ్యర్థులే లేకపోవడంతో గ్రేటర్ పరిధిలో కనిష్ఠంగా 20 నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా హంగామా చేస్తున్నా.. గ్రేటర్లో మాత్రం చతికిలపడుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపిన గ్రేటర్ ఓటర్లు.. ఊహించనిరీతిలో జరిగిన అభివృద్ధిని చూసి మళ్లీ అధికార పార్టీకే జై కొడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని ఓటర్లు నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టమవుతున్నది.
కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఆయా సీట్లను భర్తీ చేయాలని ఇన్నాళ్లూ వేచిచూశాయి. కానీ, వారికి నిరాశే ఎదురవడంతో ప్రధాన నియోజకవర్గాలు లేకుండానే మొదటి జాబితాను ప్రకటించాయి. కాంగ్రెస్ మొదటి జాబితాలో పాతబస్తీలోని ఆరు నియోజకవర్గాలున్నాయి. అందులో నాలుగు సీట్లు బీసీలకు ఇచ్చింది. బీజేపీది మరింత దయనీయ స్థితి. ప్రకటించిన పది స్థానాల్లో ఐదు పాతబస్తీవే. ఓడిపోయే చోట సీట్లు ఇవ్వడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రపంచ స్థాయి కంపెనీలు మహానగరంలో కొలువుదీరాయి. ఐటీ రంగంలో ఎగుమతులు పెరిగాయి. పదేండ్లలో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. అందుకే ఇటీవల నగరానికి వస్తున్న సెలబ్రిటీలు నగరాభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు.. ప్రశంసిస్తున్నారు. దీంతో గ్రేటర్ ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల ముందుంచుతున్నారు. తమ కండ్ల ముందే అభివృద్ధి కనిపిస్తుండటంతో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రేటర్లో వార్వన్ సైడ్ అని పలు సర్వే సంస్థలు తేల్చేయడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు జంకుతున్నారు.