BRS @ 25 Years | గులాబీ జెండా.. ఎక్కడ రెపరెపలాడినా తెలంగాణే గుర్తుకొస్తుంది. ఆ జెండాను తెలంగాణ అస్తిత్వ పతాకంగా నిలిపిన కేసీఆర్ అనే మూడక్షరాలు మెరుస్తాయి. ఆ మెరుపే తెలంగాణను తేజోమయం చేసిన విద్యుల్లత. ఆ పార్టీ భారత రాష్ట్ర సమితి. తెలంగాణే జెండాగా, ఎజెండాగా నిలిచి గెలిచిన పార్టీ బీఆర్ఎస్. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి, తెలంగాణను సాధించి, తెచ్చిన రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపింది. తెలంగాణ తలరాతను మార్చి సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించింది. జలదృశ్యం నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన పార్టీ ఏప్రిల్ 27తో 25వ పడిలోకి అడుగుపెడుతున్నది. పార్టీ రజతోత్సవ ఆవిర్భావ సంరంభాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ.. తెలంగాణను సాధించిన పార్టీ.. పదేండ్లు తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి. త్వరలో రజతోత్సవ సంవత్సరంలోకి అడుగిడబోతున్నది. 2001, ఏప్రిల్ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడుపోసుకున్న పార్టీ.. ఏప్రిల్ 27, 2025 నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి ప్రవేశించనున్నది. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవ ఆవిర్భావ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ 14 ఏండ్లు అవిరామంగా పోరాటం చేసి, అనేక ఉద్యమాలు చేసింది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా ప్రజల్లో బీఆర్ఎస్ సుస్థిరస్థానం సంపాదించింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇంటి పార్టీగా స్థిరపడిపోయింది. తెలంగాణ సంతోషమే బీఆర్ఎస్ సంతోషం. తెలంగాణ బాధే బీఆర్ఎస్ బాధ అన్నంతగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బీఆర్ఎస్ తన పదేండ్ల పరిపాలనలో అటు అభివృద్ధిలో ఇటు ప్రజా సంక్షేమంలో అతిచిన్న వయస్సులోనే అతిపెద్ద విజయాలు సాధించి దేశాన్నే అబ్బురపరిచింది.
మరపురాని గట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా..
బీఆర్ఎస్ ఆవిర్భవించి ఏప్రిల్ 27 నాటికి 24 ఏండ్లు పూర్తయ్యి, 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో సుదీర్ఘ పోరాట ప్రయాణం, ఉద్యమఘట్టాలు, మరపురాని సమరశీల అంశాలను పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారీ ఎత్తున కార్యాచరణపై కసరత్తు చేస్తున్నది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంరంభాన్ని అద్వితీయంగా ప్రారంభించి ముందుకు సాగాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నది. ఏప్రిల్‌లోనే రజతోత్సవ సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో అనుకున్న బహిరంగసభను నిర్వహించి ఆ తర్వాత నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్సమైన ఏప్రిల్ 27 వరకు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతున్నది. పార్టీ ఆవిర్భావ సంరంభాన్ని పురస్కరించుకొని రెండు రోజులపాటు ప్రతినిధుల సభను పెట్టుకొని పార్టీ సమీక్షించి, సింహావలోకనం చేసుకొని, సభ్యత్వనమోదు పుస్తకాలను సిద్ధం చేసుకొని సభ్యత్వ నమోదును ప్రారంభించి, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకొని, సెప్టెంబర్ నాటికి అధ్యక్ష ఎన్నికను కూడా పూర్తి చేసుకొని, ఆ తర్వాత భారీ బహిరంగ సభ పెడితే బాగుంటుందనే ఆలోచనను కొంతమంది సీనియర్లు తమ అభిప్రాయంగా పార్టీ పెద్దల వద్ద వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇప్పుడూ అప్పుడు రెండుసార్లు నిర్వహిస్తామని, రెండుసార్లు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుందనే మరో అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు సమాచారం. అయితే, పార్టీ సంస్థాగత నిర్మాణం, అధ్యక్ష ఎన్నిక వంటి అంశాలు ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించుకోవటం సర్వసాధారణమేనని, పార్టీ రజతోత్సవ ప్రారంభ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చరిత్రాత్మక ప్రయాణాన్ని, తెలంగాణను ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రస్థానాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని, ప్రతిభ, దార్శనికతను దశదిశలా చాటేలా కార్యక్రమాలు తీసుకోవాలనే యోచనలో పార్టీ శ్రేణులు ఉన్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
విశ్వాసమే ఆయువుపట్టుగా
తెలంగాణ కోసం ఎక్కడెవడూ లేనప్పుడు.. దిక్కులేకుండా తెలంగాణ పడి ఉన్నప్పుడు.. ఏమైతది తెలంగాణ అని రందితో తొక్కులాడుతున్నప్పుడు.. పట్టించుకునేనాథుడే లేనప్పుడు.. అధికారంలో ఉన్న టీటీపీ, కాంగ్రెస్ నిట్టనిలువునా తెలంగాణకు అన్యా యం, దగా చేస్తున్నప్పుడు.. మోసం చేస్తున్నప్పుడు.. ఒక్కడై కేసీఆర్ బయలుదేరిండు. తెలంగాణ అయితదా? పోతదా? అనే సంశయంలో ఊగిసలాడుతున్నప్పుడు పిడికెడు మందిని తన వెంట పెట్టకొని బయలుదేరిండు. బక్కపలచని మనిషి.. సినీ గ్లామర్లేదు.. ఆర్థికంగా పరిపుష్టి ఉన్న నాయకు డు కాదు.. అన్నింటికీ మించి ఇద్దరు బలమైన నాయకులు (చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి).. మీడియా మద్దతు అసలే లేదు.. ఇలాం టి ప్రతికూలతల మధ్య ‘జై తెలంగాణ’ నినాదం ఎత్తుకున్నడు. తెలంగాణ పట్ల బలమైన విశ్వాసాన్ని కల్పించాలంటే ‘కేసీఆర్ పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు’ అని నిరూపించాలి? అందుకు ఆయన ఏం చేశాడు? డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఇలా ఏకకాలంలో మూడు పదవులను గడ్డిపోచలా విసిరికొట్టిండు. తెలంగాణ చర్చకు తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసిండు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తాను ఎత్తుకున్న ‘జై తెలంగాణ నినాదం నుంచి పదవుల కోసమో..మరో దానికోసమో పక్కకుపోతే రాళ్లతో కొట్టి చంపుండ్రి’ అని పిలుపునిచ్చిండు. ఇవన్నీ తెలంగాణ సమాజంలో నమ్మికను కలిగించాయి. కేసీఆర్‌వెంట నడిచేందుకు దోహదపడ్డాయి.
అందరిచేతా ‘జై తెలంగాణ’ అనిపించేందుకు..
2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిననాడు తెలంగాణ ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం 2014లో రాష్ర్టాన్ని సాధించేదాకా కేసీఆర్ అలుపెరుగని పోరు సలిపిండు. 2001 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం ఎన్ని వ్యూహాలు? ఎన్ని పోరాట మార్గాలు? గతానుభవాలు నేర్పిన పాఠాలతో ఈసారి తెలంగాణ వెనక్కి వెళ్లిపోతే ఇక తెలంగాణ నినాదమే ఆఖరికి అసెంబ్లీలోనే కాదు; సమాజంలోనూ తెలంగాణ పదం శాశ్వత నిషేధమేనని గ్రహించిండు కనుకనే పుట్టినగడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని అవమానాలను దిగమింగిండు. ప్రజల్లో సడలిపోయిన తెలంగాణ విశ్వాసాన్ని ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులో నిలిపిండు. ఒక్క పార్టీకూడా మద్దతు ఇవ్వని తెలంగాణకు దేశంలోని 36 పార్టీలు మద్దతిచ్చేస్థాయికి తీసుకొచ్చిండు. తెలంగాణకు అడ్డంపడ్డవాళ్లతోనే ‘జై తెలంగాణ’ అనిపించిండు. ఎదుటివారి రాజకీయ అనివార్యతను తనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని తెలంగాణకు బలంగా మార్చిండు.
బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ, తెలంగాణ కర్త, తెలంగాణ క్రియ. తెలంగాణ సంతోషమే బీఆర్ఎస్ సంతోషం. తెలంగాణ బాధ బీఆర్ఎస్ బాధ అనే స్థాయికి బీఆర్ఎస్ను తీసుకొచ్చిండు. తెలంగాణ కోసం ‘గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటా.. కుష్టురోగినైనా కౌగిలించుకుంటా’ అని 2004లో ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యమని తెలంగాణ సమాజం తనవెంట నడిచేందుకు తనుకు తానుగా బాటలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది. పొత్తు ధర్మాన్ని వీడిన కాంగ్రెస్ 2006లో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకొని తెలంగాణ నినాదం సచ్చిపోయిందని నిరూపించే ప్రయత్నం చేసినా నిటారుగా నిలబడి సడలిపోని ధైర్యంతో పోరాటం చేసిండు. తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించిన టీడీపీతో 2009 ఎన్నికల్లో పొత్తుపెట్టుకొని ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా అనివార్యతను కేసీఆర్ సృష్టించిండు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే తెలంగాణ సాధ్యమని, అందుకు అన్ని పార్టీల మద్దతు అవసరమని మెలికపెడితే దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒప్పించి వాటితో తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించిండు.
రెండువైపులా పదునైన కత్తి..
ఒకవైపు లాబీయింగ్..మరోవైపు పోరాటం ఈ రెండు మార్గాలను సమాంతరంగా నడుపుతూ 2014లో తెలంగాణ గమ్యాన్ని ముద్దాడిన ధీశాలిగా కేసీఆర్ చరిత్ర సృష్టించిండు. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ ప్రసంగాలను, కేసీఆర్ వ్యూహాలను, కేసీఆర్ ఎత్తుగడలను గమనించినవారి అంచనాలకు అందనంత ఎత్తున తెలంగాణను నిలిపిండు. తన పదునైన వ్యూహాలతో ఎప్పటికప్పుడు తెలంగాణ వాదా న్ని, నినాదాన్ని నిత్యం సజీవంగా ఉంచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకోని అంశం.. కేసీఆర్ పట్టుకోని విషయమూ లేదంటే అతిశయోక్తికాదు. 2014 నుంచి పదేండ్ల పాటు అంతకుముందు 14 ఏండ్లపాటు ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌ను చూసినవారు, విన్నవారు ఆయన ఆచరణ, అసమాన్య పాలనాదక్షతను చూసి నివ్వెరపోయారు. తన పదేండ్ల పాలనా కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో అకాశమంత ఎత్తున నిలిపారు. తెలంగాణ వస్తే కరెంట్‌లేక ‘చీకటి’ రాజ్యమేలుతుందని, నక్సలిజం పెట్రేగిపోతుందని, పద్నాలుగేండ్ల ఉద్యమ తెలంగాణ నిత్యం ఆందోళనలతో కూరుకుపోతుందని, సాగునీరు లేక, తాగునీరులేక, పాలించే నైపుణ్యం లేక తెలంగాణ ఎందుకూ పనికిరాకుండాపోతుందని శాపనార్థానాలు పెట్టినవారు కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పాలనను చూసి కాపీ కొట్టాల్సిన అనివార్యతలను తెలంగాణ సృష్టించింది. ఇంతటి ఘన చరిత్రను మరోసారి మననం చేసుకొని మది మది పులకించిపోయేలా పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంరంభాన్ని అంబరాన్నంటేలా నిర్వహించాలని పార్టీ భావిస్తున్నది.
తెలంగాణ కోసం జోలెపట్టి భిక్షమెత్తి..
టీడీపీ, కాంగ్రెస్‌ల ఏలుబడిలో ఛిద్రమైపోయిన తెలంగాణ జీవనచిత్రాన్ని చూసి కేసీఆర్ కంటనీరు పెట్టుకున్నడు. చేనేత కార్మికుల ఆకలిచావులు చూసి చలించిపోయిండు. రైతన్నల ఆత్మహత్యలు నిత్యకృత్యంలా సాగుతున్న కాలానికి ఎదురునిలిచి ధైర్యం నింపిండు. తలాపునే గోదావరి, కృష్ణమ్మ పారుతున్నా చుక్కనీరు లేక గొంతులెండుతున్న తెలంగాణ కష్టాన్ని చూసి కన్నీటిపర్యంతమైండు. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో నాటి నేతన్నల ఆత్మహత్యల పరంపర, ఆత్మహత్యలు చేసుకోవద్దని కలెక్టర్లు గోడల మీద విజ్ఞప్తులు చేస్తున్న కాలాన్ని చూసి కేసీఆర్ చలించిపోయిండు. సిరిసిల్ల, పోచంపల్లి ప్రాంతాల్లో నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే తట్టుకోలేక జోలెపట్టి విరాళాలు సేకరించిండు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసిండు. ములుగులో బిడ్డ పెండ్లికోసం అప్పుతెచ్చిన సొమ్ము, బంగారం ఆగ్నిప్రమాదానికి గురై కాలిబూడిద కావడంతో కన్నీరుమున్నీరైన తండాకు అన్నీతానై కేసీఆర్ అండగా నిలిచిండు. కల్పన అనే గిరిజన యువతి పెండ్లికి ఆర్థిక సాయం చేసిండు (ఆ కల్పన దీన నేపథ్య గాథ నుంచే కల్యాణలక్ష్మి పథకం పుట్టింది).
కుట్రల బోనులోంచి బెబ్బులిలా..
2001లో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి దాకా బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పార్టీ పెట్టినప్పుడు అసలు ఈ పార్టీ ఉంటదని, ‘మఖలో పుట్టి పుబ్బలో పోతది’ అని, కేసీఆర్ పదవుల కోసమే పార్టీ పెట్టిండని, తెలంగాణపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ఆయనపై ముప్పేటదాడి జరిగింది. చంద్రబాబు ఎత్తులతో శిథిలావస్థలో చిక్కిశల్యమైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో 2004లో పొత్తుపెట్టుకోవటం వల్ల ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నకాలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ను నిట్టనిలువునా చీల్చారు. తెలంగాణ వాదం లేదని నమ్మబలికే ప్రయత్నం చేస్తే 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి మాత్రమే కాకుండా కరీంనగర్ ఎంపీ పదవికీ రాజీనామా చేసి తెలంగాణవైపు దేశం తిరిగి చూసేలా చేసినప్పటి నుంచి.. ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో తెలంగాణ జైత్రయాత్రో’ అని నినదించి నవంబర్ 29, 2009 ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటనతో కేంద్రం దిగివచ్చేలా చేసిన చరిత్ర కేసీఆర్‌ది. బీఆర్ఎస్ పార్టీది. ఎంచుకున్న లక్ష్యసాధన కోసం ప్రతి సందర్భాన్ని తెలంగాణ సందర్భంగా మలిచిన చరిత్ర కేసీఆర్‌ది. ఆందోళనలు, ఆమరణ నిరాహారదీక్షలు, బహిరంగసభలు మాత్రమే కాదు ఉప ఎన్నికలను సైతం ఉద్యమవ్యూహంగా మలిచిన చరిత్ర కేసీఆర్‌ది. బీఆర్ఎస్ పార్టీ ‘మఖలో పుట్టింది పుబ్బలో పోతది’ అని వెక్కిరింతలు చేసినా తన 25 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని శిలాసదృశంగా మలిచిన చరిత్ర బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ను ఆ విధంగా తీర్చిదిద్దిన చరిత్రా కేసీఆర్‌ది. కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదని అనేక సందర్భాలు నిరూపించాయి. ఆ మాటకొస్తే ఇప్పుడూ కేసీఆర్‌ను ఓడగొట్టి ఇబ్బందులపాలవుతున్నామని ప్రజలే బాహాటంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న ప్రత్యక్ష సందర్భమే నిదర్శనం.
పాలనలో కేసీఆర్‌కు సాటెవ్వరు?
‘మేం ఆశ్చర్యపోయాం. కేసీఆర్ అంటే ఏదో తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు. పవర్ఫుల్ డైలాగ్స్‌తో తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నడు. వారితో పోరాటం చేయించిండు. తను పోరాటం చేసిండు. లాంగ్పెండింగ్ ఇష్యూగా సెంటర్ ఫీల్ అయి తెలంగాణ ఇచ్చింది అనుకున్నం. కానీ, తెలంగాణ అంశంలోనే కాదు.. అడ్మినిస్ట్రేషన్‌లో ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలి? ప్రాధాన్యాలు ఎలా ఉండాలి? ప్రజలకు ఏం కావాలి? తెలంగాణ వెనుకబాటుతనానికి కారణం ఏమిటి? దాన్నెలా అధిగమించాలి? దేశంలో వివిధ రాష్ర్టాలు ఏయే స్కీమ్స్ అమలు చేస్తున్నయి? ప్రపంచంలో వెనుకబడిన దేశాలు ఎలా ముందుకు సాగాయి? వంటి అనేక విషయాల్లో మైక్రోలెవల్కు వెళ్లి అధ్యయనం చేసి మాకు డైరెక్షన్ ఇస్తాడని అసలే అనుకోలేదు’ అని జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఒక జిల్లా కలెక్టర్ చెప్పడం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వాలకు ప్రజల యోగక్షేమాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని, పాలకుడి దక్షతను ఉన్నతాధికారులు బేరీజు వేసి చూసుకోవటం, అధికారులకు తెలంగాణ ముందు, తర్వాత అనే బెంచ్‌మార్క్‌ను కేసీఆర్ సెట్ చేశారు.
కేసీఆర్ పరిపాలనాదక్షతకు జిల్లాల పునర్విభజన, సాగునీటి రంగంలో మిషన్‌కాకతీయ, నీటిప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ కీర్తిని ఆకాశమంత ఎత్తుకు నిలిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, శాంతిభద్రతల్లో మేటిగా నిలిపే కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకో మెడికల్ కాలేజీ, మిషన్‌భగీరథ, దేశ వ్యవసాయ రంగ ముఖచిత్రానికి మార్గదర్శిగా నిలిచిన రైతుబంధు ఇలా అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో తెలంగాణను నిత్యనూతన పథంలో కేసీఆర్ నడిపిండు. ఫలితంగా తలసరి ఆదాయంలో జాతీయ సగటుకన్నా డబుల్ సాధించటం, సగటు విద్యుత్తు వినియోగంలోనూ అదేస్థాయిలో తెలంగాణ నిలవటం, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలపటం, టీఎస్ ఐపాస్ ద్వారా నూతన పారిశ్రామిక విధానం ఇలా అనేక రంగాల్లో తెలంగాణను బీఆర్ఎస్ నంబర్ వన్ స్థాయికి చేర్చింది. ఈ నేపథ్యంలో వీటినీ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంరంభం వేడుకగా ప్రతిమదికీ చేర్చాలని పార్టీ భావిస్తున్నది.
శిఖరాయమాన కీర్తి కేసీఆర్
ఉద్యమంలోనే కాదు, పాలనలోనూ తెలంగాణను శిఖరాయమానం చేసిన దార్శనికత కేసీఆర్‌ది అని కేంద్రప్రభుత్వం అనేక సందర్భాల్లో కీర్తించింది. ఒకనాడు ఈసడించుకున్న తెలంగాణను ఇంద్రధనుస్సులా మార్చిన దిక్సూచి కేసీఆర్ అని రాజకీయంగా తను అంటే గిట్టనివారు సైతం అంగీకరించే సత్యం. ‘మిషన్‌కాకతీయతో చెరువు సిగలో మొగ్గ అయిండు, మిషన్‌భగీరథతో గొంతులో మంచినీరైండు కేసీఆర్..
తెలంగాణకు చిన్ననీటి వనరులను పెద్ద ఆదెరువుగా నిలిపి అందరికీ ఆదర్శప్రాయమైండు’ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ వంటివారు ప్రశంసించిన సందర్భాలు అనేకం.
గోదావరిని కాళేశ్వరంతో ఎత్తిపోసి దేశానికి కేసీఆర్ జలసందేశాన్ని ఇచ్చారని, అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నివేశమే సజీవ ఉదహరణ అని ఆయన ఉదహరించారు. తెలంగాణ చీకటి అయితదని శాపనార్థాలు పెట్టినోళ్ల కండ్ల ముందు వెలుగుజిలుగుల విద్యుత్తు తేజమై ప్రజ్వరిల్లేలా చేసిండు. తెలంగాణ చీకటి అయితదని చెప్పిన నాయకుడే రాజకీయ భవిష్యత్తులేకుండా మారిపోయాడని ఉదహరిస్తున్నారు. ‘ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను, పొతంపట్టిపోయిన పోచంపల్లిని సిరుల ముల్లెలుగా మార్చిండు’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే కేసీఆర్ పట్టుదలను కొనియాడారు. ‘కేసీఆర్ రైతు ఇంట కనుల పంట అయిండు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో ఎవుసం మెడలో సింగిడైండు. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ అయిండు. గర్భందాల్చిన ఆడబిడ్డకు మేనమామలా న్యూట్రిషన్ కిట్ అయిండు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్స్.. ఇలా సంక్షేమంలో కేసీఆర్ హయాంలో తెలంగాణ స్వర్ణయుగం’ అని కవి, గాయకులు తమతమ రచనల్లో ఆకాశానికెత్తారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలను గొప్పగా నిర్వహించుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్న తరుణంలో త్వరలో నిర్వహించే పార్టీ కార్యవర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
గుండె గుడిలో గులాబీ పార్టీ
గులాబీ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనడానికి నిదర్శనం ఈ దృశ్యం. కొడంగల్ నియోజకవర్గం చౌదర్పల్లి గ్రామానికి చెందిన కావలి పార్వతమ్మ బుధవారం మన్నెంకొండ వేంకటేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరింది. తుంకిమెట్ల స్టేజీ వద్ద బీఆర్ఎస్ జెండా గద్దె కనిపించడంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. గద్దెకు కొబ్బరికాయ కొట్టి, అగర్బత్తీ వెలిగించి మొక్కింది. స్థానికులు పలకరిస్తే.. ‘మా దేవుడు కేసీఆర్ సార్.. ఆయన ఇచ్చిన నీళ్లు తాగే బతుకుతున్నం. మళ్లీ ఆయనే రావాలి’ అంటూ పార్వతమ్మ చెప్పుకొచ్చింది.