BRS Party | హైదరాబాద్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్‌ను లేకుండా చేస్తానన్న నవీన్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, కె.కిషోర్ గౌడ్, రామచంద్రు నాయక్, ఉపేంద్ర చారి ఉన్నారు.
ఇటీవల బీఆర్ఎస్ క్యాడర్‌ను ఉద్దేశించి ‘గల్లీ దాటరు.. ఇంటిని చూడరు’ అంటూ బెదిరించిన ఆయన తాజాగా గులాబీ క్యాడర్‌నే లేకుండా చేస్తానని బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తాజాగా ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ‘బీఆర్ఎస్ క్యాడర్‌ను లేకుండా చేస్తా అంటున్నారు.. నిజంగా లేకుండా చేస్తారా?’ అని ప్రశ్నించగా ‘ఏసేస్తా’… వారం రోజుల్లో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా’ అంటూ మరోసారి ధమ్కీ ఇచ్చారు. దీనిపైనా సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. రౌడీబిడ్డకు టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులకే పాల్పడతారు, జూబ్లీహిల్స్ ఓటర్లూ బహుపరాక్ అని పలువురు సూచించారు. అయితే నవీన్‌యాదవ్ ఎన్ని ధమ్కీలు ఇచ్చినా బీఆర్ఎస్ క్యాడర్‌ను ముట్టుకోవడం కూడా సాధ్యం కాదని బీఆర్ఎస్ నేతలు బదులిస్తున్నారు.