సిద్దిపేట/గజ్వేల్, డిసెంబర్ 11( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు దుమ్ము లేపింది. అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకొని అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కారు జోరు ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొంది సత్తాచాటారు. నియోజకవర్గంలో 107 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ 55, కాంగ్రెస్ 42, బీజేపీ 04, ఇతరులు 6 స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక చాలా గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. రెండు పార్టీలు కలిసిన బీఆర్ఎస్ను పంచాయతీ పోరులో ఎదుర్కోలేకపోయాయి.
పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు అధికార పార్టీ వేధింపులు కూడా ఎక్కువే అయ్యాయి. వీటన్నింటిని తట్టుకొని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో సత్తాచాటారు. అధికార కాంగ్రెస్ కుట్రలను ఛేదించారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు. ఆ అభివృద్ధి పనులే బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డాయి. అత్యధిక సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని గులాబీశ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంతోపాటు దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఎన్నికలు జరగగా అన్నింటా బీఆర్ఎస్ హవా కొనసాగించింది.