BRS | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో ‘స్పెషల్ లీవ్ పిటిషన్’ను (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా తన పిటిషన్లో బీఆర్ఎస్ ఉదహరించింది.
ఈ కేసు తీర్పు సందర్భంగా ఇలాంటి కేసుల్లో స్పీకర్ మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుందని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, ఈ తీర్పునకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పేర్కొన్నది. ఫిరాయింపుల అంశంపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ కోరింది. తమ పార్టీ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై గడిచిన ఏడాదికాలంగా వివిధ రూపాల్లో పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ గతంలో హైకోర్టును ఆశ్రయించింది.
తొలుత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని, విచారణ జరపాలని శాసనసభాపతికి, కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలపై గడిచిన ఆరు నెలలుగా శాసనసభ నుంచి ఎలాంటి స్పందనరాలేదు. ఇదే కాలంలో మరో ఏడుగురు సభ్యులు కూడా పార్టీ మారారు. మొత్తం 10 మందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
స్పీకర్ నుంచి ఆశించిన స్పందన రాలేదని బీఆర్ఎస్ అనేక సందర్భాల్లో పేర్కొన్నది. శాసనసభ కార్యదర్శి, స్పీకర్ నుంచి ఆరు నెలలైనా స్పందన లేకపోవడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా చర్యలు తీసుకోవడంలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసి పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొన్నది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై ఎస్ఎల్పీ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు.