హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని, లోక్‌సభలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేనంత మాత్రాన పార్లమెంటరీ ప్రజస్వామ్య వ్యవస్థలో తమ పార్టీ పాత్రినిధ్యమే లేదన్నట్టు వ్యాఖ్యానించటం సరికాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా నియమితులైన కేఆర్ సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించామనే విషయాన్ని, ఆ సమయంలో నేరుగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ఎవరూ విస్మరించొద్దన్న ఆయన, ‘నమస్తే తెలంగాణ’కు మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ అవకాశం రావటంపై మీ స్పందన?
పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా నియామకం కావడం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటా. నా జీవితంలో మర్చిపోలేని గౌరవాన్నిచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు.
పార్లమెంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది?
తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ బీఆర్ఎస్ ఒక సంచలనమనే విషయాన్ని ఎవరూ విస్మరించొద్దు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ చరిత్రను చూడాలి. సాంకేతికంగా మాకు లోక్‌సభలో సభ్యులు లేనంత మాత్రాన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల పాత్రను తక్కువ చేసి చూడొద్దు. తెలంగాణ ప్రయోజనాల అంశంలో బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. తెలంగాణ హక్కుల సాధన విషయంలో అవసరమైతే దూకుడు పెంచుతామే కానీ తగ్గే ప్రసక్తేలేదు. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, జిల్లాకో మెడికల్ కాలేజీ ఇలా అనేక విషయాల్లో దేశం, అనేక రాష్ర్టాలు తెలంగాణను, కేసీఆర్‌ను అనుసరించాయి. సాగునీరు, విద్యుత్, ఐటీ వంటి రంగాల్లో కేసీఆర్ విధానాలు ఎప్పటికీ రిలవెన్సే. పార్లమెంట్ సమావేశాలన్నప్పుడు, లేనప్పుడు పార్లమెంటరీ కమిటీల్లో చురుగ్గా పాల్గొంటాం. కమిటీల్లో పాలసీ, పరిశోధన, చట్టాల రూపకల్పనలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం. పార్లమెంట్ చర్చలు, ప్రశ్నోత్తరాలను సంపూర్ణంగా వినియోగించుకుంటాం. పార్టీ అధినేత దిశానిర్దేశానికి అనుగుణంగా కార్యాచరణ ఉంటుంది. సమావేశాల్లో మా సభ్యులందరం క్రియాశీలకంగా పాల్గొనేందుకు, సభ్యులకు కావాల్సిన సమాచారం అందజేస్తా. పార్లమెంట్ కమిటీల్లో బీఆర్ఎస్ మార్క్ చూపిస్తాం.
పార్లమెంట్లో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వ సమావేశాల తీరు ఎలా ఉంటుందంటారు?
కచ్చితంగా గత పార్లమెంట్ కంటే ఈసారి భిన్నంగానే ఉంటుంది. ప్రజాభీష్టం మేరకు రూలింగ్ పార్టీ నడుచుకోవాలి. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వారి సూచనలు స్వీకరించాలి. అలా కాకుండా అధికారం చేతిలో ఉంది కదా అని వ్యవహరిస్తే అన్ని పార్టీలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తాం. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏమిటో ఈసారి స్పష్టంగా కండ్ల ముందున్నది. ప్రజానుకూల ప్రభుత్వం ఉండాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలన్నదే దేశ ప్రజల తీర్పు. గతంలో ప్రభుత్వం సభ్యుల వ్యాఖ్యలను బుల్డోజ్ చేసినట్టుగా ఇప్పుడు కుదరదని ఈ సారి ప్రభుత్వానికి ముందే తెలిసింది. కనుక జాగ్రత్తగా ఉంటుందని, అన్ని పక్షాలకు సమాన గౌరవాన్నిస్తుందని ఆశిస్తున్నాం. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరఫున మేము నిర్మాణాత్మక పాత్రను పోషిస్తాం.
నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని మీరెలా చెప్తున్నారు?
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలే ప్రజల పక్షాన చట్టసభల్లో, బయటా ప్రాతినిధ్యం వహిస్తాయి. అధికారం లేనంత మాత్రాన, సభలో ప్రాతినిధ్యం లేనంత మాత్రాన రాజకీయ పార్టీ ఉండనే ఉండదనుకోవటం అవగాహనా రాహిత్యమే. దశాబ్దాలుగా ఎదురుచూసిన తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ, దాదాపు పదేండ్లపాటు దేశమే ఆశ్చర్యపోయేలా రాష్ర్టాన్ని ముందుకు నడిపిన పార్టీకి మనుగడ ఉండదనుకోవడం పొరపాటే అవుతుంది. తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల సాధనలో బీఆర్ఎస్ ప్రాముఖ్యత ఇప్పుడే ఎక్కువ అవసరం. ఇలాంటి క్లిష్ట సమయంలో బీఆర్ఎస్కు లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉంటే మరోలా ఉండేది. బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలున్నారు సరే.. వారు ప్రాతినిధ్యం వహించే పార్టీల నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారే తప్ప తెలంగాణ ప్రజల కోణంలో వాటి కార్యాచరణ ఉండదని గతానుభవాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు, నీటి కేటాయింపులు ఇలా అనేక అంశాల్లో బీఆర్ఎస్ తన పాత్రను తప్పకుండా పోషిస్తుంది. ఈ విషయంలో కేసీఆర్ ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు.