హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌కు ని ధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నుంచి 2023 వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం దాదాపు రూ.19 వేల కోట్లకుపైగా నిధులను చెల్లించిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలోని బకాయిలను సైతం దాదాపు రూ.4వేల కోట్లను విడుదల చేసిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్ బకాయిలను విడుదల చేయబోమని మొండికేయడమేమిటని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్, ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు, ఓవర్సీస్ స్కీమ్ దరఖాస్తులు, బకాయిలు తదితర అంశాలపై శుక్రవారం ఆయన అసెంబ్లీలో లేవనెత్తారు.
ఆయా స్కీమ్‌లకు సంబంధించి ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించడం లేదని మండిపడ్డారు. కేవలం ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలనే సభకు నివేదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కు ఈ విద్యా సంవత్సరం నుంచి మాత్రమే నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తున్నదని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.4 వేల కోట్లు బకాయిలు ఉండగా, అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని చెల్లించిందని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో కాలేజీలు మూతపడుతున్నాయని వివరించారు.
ప్రైవేట్ కాలేజీల్లో దాదాపు రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, వారి వేతనాలను చెల్లించలేక కాలేజీ యాజమాన్యాలు సతమతమవుతున్నాయని తెలిపారు. ఫీజులు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులకు ఆదేశిస్తున్నారని, నిబంధనలు పాటిస్తేనే ఇప్పుడు నిధులను చెల్లిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. మైనారిటీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందిస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆయా పథకాల ద్వారా అనర్హులు సైతం లబ్ధి పొందుతున్నారని, నిజమైన అర్హులు లబ్ధి పొందలేని పరిస్థితి నెలకొన్నదని, వాటికి ఎంపిక ప్రక్రియపై సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఇందుకు ఆల్‌పార్టీ మీటింగ్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వలేక ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తడబడ్డారు. ఆయా అంశాలపై సభకు నివేదించిన గణాంకాలను సైతం చెప్పలేక తికమకపడ్డారు. గణాంకాలను పదేపదే ఏకరువు పెట్టారు. ఏ ప్రశ్నకూ స్పష్టమైన సమాధానివ్వలేకపోయారు. మొత్తంగా ఫీజులకు సంబంధించి రూ.8591 కోట్లు బకాయిలున్నాయని, ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని వెల్లడించారు.
మంత్రి తడబాటును గమనించిన ప్యానల్ స్పీకర్ కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటూ.. సభకు నివేదించిన గణాంకాలను వదిలేసి, బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారనే అంశంపై సమాధానమిస్తే చాలని సూచించారు. ఈ క్రమంలో సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ.. ఆయా పథకాలకు సంబంధించి అక్బరుద్దీన్ ప్రస్తావించిన అంశాల్లో పలు కీలకమైనవి ఉన్నాయని, వాటన్నింటిపై సమగ్రంగా చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అందుకోసం ఆల్‌పార్టీ మీటింగ్‌ను ఏర్పాటు చేస్తామని, సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకుంటామని హామీనిచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో చదువుల కోసం ఓవర్సీస్ స్కీమ్‌కు సంబంధించిన రూ.179.90 కోట్ల బకాయిలను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో విడుదల చేసినట్లు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన 3,008 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 1,193 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.48.42 కోట్లు, 573 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.36.95 కోట్లు, 179 మంది బీసీ విద్యార్థులకు రూ.18.41 కోట్లు, 1,063 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.76.13 కోట్లు చెల్లించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.