హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/అచ్చంపేట : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ ఆఫీసులో శుక్రవారం మీడి యా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 30న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఆర్మీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ (37)ను అనారోగ్య సమస్యలు, ఇన్డిసిప్లెన్ చర్యల వల్ల ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో అతను మద్రాస్ రెజిమెంట్‌లోని ఆయుధాలను దొంగిలించాలని పథకం రచించాడు. ఆగస్టు 28, 29 తేదీల్లో వాటిని దొంగిలించేందుకు రెక్కీ నిర్వహించాడు. సెక్యూరిటీకి తాను మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన అధికారినని కోడ్ భాషలో చెప్పి లోపలికి వెళ్లేవా డు. ఆగస్టు 30న రాత్రి 11 గంటలకు బాలాజీనగర్‌లోని తన ఇంటి నుంచి యాక్టివాపై కార్గిల్ గేటు ద్వారా మద్రాస్ రెజిమెంట్‌లోని కోట్ వద్దకు మల్లేశ్ చేరుకున్నాడు. తాళం పగులగొట్టి ఆయుధాలు వాటికి అవసరమైన అమ్యునేషన్ను యాక్టివాపై పెట్టుకుని బాలాజీనగర్‌లోని ఇంటికి తెల్లవారుజామున 4.34 గంటలకు చేరుకున్నాడు.
ఆయుధాలను బ్రీజా కారులో లోడ్ చేసుకుని అచ్చంపేట వైపు వెళ్లాడు. అనుమానం రాకుండా నలుగు రు ప్యాసింజర్లను ఎకించుకుని దేవరకొండ వద్ద దింపాడు. మళ్లీ డిండి వద్ద ఇద్దరిని ఎకించుకొని పేమెంట్ తీసుకుని ఎవిడెన్స్ క్రియేట్ చేశాడు. 31న అచ్చంపేటలోని తన సొంతింటికి చేరుకున్న మల్లేశ్ గడ్డివాము కింద గుంత తీసి ఆయుధాలు పాతిపెట్టాడు. విచారణలో భాగంగా 8.5 లక్షల ఫోన్ కాల్స్‌ను పరిశీలించినట్టు డీజీపీ తెలిపారు. చివరికి మల్లేశ్‌ను నిందితుడిగా గుర్తించినట్టు చెప్పారు. మల్లేశ్ భార్యకు కేసు తీవ్రత గురించి వివరించి ఆమె ద్వారా గట్టిగా అడిగించడంతో నిజం ఒప్పుకొన్నాడని అన్నారు. అతని నుంచి 4 ఏకే-203 వెపన్స్, 5 మ్యాగజైన్లు, ఒక 5.56 ఎంఎం ఇన్సాస్, 3 మ్యాగజైన్లు, ఆరు 9 ఎంఎం ఆటో 1ఏ పిస్టల్స్, 12 మ్యాగజైన్లు, ఒక సివిల్ 6.35 పిస్టల్, ఒక మ్యాగజైన్, పాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్, 1ఏ పిస్టల్‌కు చెందిన 1,156 రౌండ్లు, ఏకే-203కి చెందిన 720 రౌండ్లు, ఇన్సాస్కు చెందిన బాల్-11 బుల్లెట్లు, ట్రేసర్లు 5 స్వాధీనం చేసుకున్నారు.