చాలామంది ఉద్యోగమే జీవితం అనుకుంటారు. చేసే పని మనసుకు నచ్చకపోయినా.. బాధ్యతల కోసం రాజీ పడుతుంటారు. ఒత్తిడితో చిత్తవుతూనే భారంగా ఉద్యోగ జీవితం గడిపేస్తుంటారు. ఈ యువతి మాత్రం.. కార్పొరేట్ కొలువులో తలమునకలు కావడం కన్నా.. మనసుకు నచ్చిన పనిలో నిలదొక్కుకోవడమే మేలు అని భావించింది. ఆన్లైన్ వేదికగా ఆర్ట్ కోర్స్ నేర్చుకొని.. కళల ప్రపంచంలో ఏ ఒత్తిడికీ గురికాకుండా చక్కటి ఆదాయం పొందుతున్నది. గుజరాతీ ప్రాచీన కళ ‘లిప్పన్ ఆర్ట్’కు ప్రాణం పోస్తూ ప్రతిభను చాటుకుంటున్న దొమ్మేటి చైతన్య తన జర్నీని జిందగీతో ఇలా పంచుకున్నది..
మనకు నచ్చింది చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. ఏదైనా ఇష్టంగా చేసినప్పుడు అందులో కష్టాలు ఎదురైనా అధిగమించగలం. నా విషయంలోనూ అదే జరిగింది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు. నాన్న ఏడుకొండలు కార్పెంటర్, అమ్మ సత్యవతి గృహిణి. నాన్న ఇంట్లోనే కార్పెంటర్ పనులు చేస్తుండేవాడు. నాన్న ఎలా పని చేస్తున్నాడో చిన్నప్పటి నుంచి ఆసక్తిగా గమనించేదాన్ని. ఆయన కలపతో చేసే పరికరాలను నేను కాగితంతో చేసేదాన్ని. మా కజిన్స్ అంతా సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్నారని నేను కూడా వాళ్లలాగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని ఎంసీఏలో చేరాను.

సెలవు రోజుల్లో వాళ్లను కలిసేందుకు హైదరాబాద్‌కు వెళుతుండేదాన్ని. వాళ్లు పని ఒత్తిడిలో పడి కుటుంబాలతో గడపడమే మరిచిపోయారు. టార్గెట్లు, డెడ్లైన్లు, బాసిజంతో ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టుగా అనిపించింది. ఇవన్నీ చూసి నాలో నాకే భయమేసింది. ఒకరి కింద పనిచేస్తూ, ఇంత ఒత్తిడికి గురవ్వడం అవసరమా? అనిపించింది. నాకు నేనుగా ఏం చేయాలనే ఆలోచన మొదలైనప్పుడు పరిచయమైందే ఈ లిప్పన్ ఆర్ట్. ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఈ కళను నేర్చుకోవడం ప్రారంభించాను. సోషల్ మీడియా ద్వారా ఈ కోర్సు గురించి తెలుసుకున్నాను.
అయితే ఈ లిప్పన్ ఆర్ట్ గుజరాతీ రాష్ర్టానికి ప్రాచీన కళ. పూర్వం అక్కడ గుడిసె గోడలపై అందమైన ఇంటీరియర్ కోసం మట్టి, అద్దాలతో లిప్పన్ ఆర్ట్ చేసేవారు. ఆ కళ చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా ఎండ తీవ్రత ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. అయితే ఇలాంటి కళను మనవాళ్లకు పరిచయం చేయాలని డిసైడ్ అయ్యాను. యూట్యూబ్‌లో లిప్పన్ ఆర్ట్ క్లాసులు చూస్తూ బేసిక్స్ నేర్చుకున్నాను. రెండు మూడు వర్క్‌షాపులకు హాజరయ్యాను. రెండు నెలల్లోనే బేసిక్స్ మీద పట్టు దొరికింది. ఫినిషింగ్‌కు మాత్రం మిగతా నాలుగు నెలలు కష్టడాల్సి వచ్చింది. ఏ వస్తువైనా ఆకర్షణీయంగా కనిపించాలంటే దానికి ఫినిషెంగే అసలైన మేకప్. ఈ ఫినిషింగ్‌ను మాత్రం మా నాన్న దగ్గరే నేర్చుకున్నాను. ఆయన చిన్న తప్పు చేసినా కస్టమర్ ముందు మాటొస్తుందని సున్నితంగా మందలిస్తూ మరీ నేర్పించేవాడు. ఉద్యోగం చేయకుండా ఎలాంటి ఆదాయం లేని ఈ పనిలోకి రావడం మూర్ఖత్వమని ఇంట్లోవాళ్లు మందలించారు. అయినా నేను వెనుకడుగు వేయలేదు. ఆ కొలువు ఇష్టం లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం చేసుకోగాని ఈ రంగంలోకి రావొద్దని వాళ్ల అనుభవాలను చెప్పినా వినిపించుకోలేదు. చివరికి నా మొండితనం భరించలేక ‘కొన్ని డిజైన్లు వేసి నిన్ను నీవు నిరూపించుకో’ అని చెప్పారు ఇంట్లోవాళ్లు. తర్వాత నా పనితనం చూసి ప్రోత్సహించడం మొదలుపెట్టారు.

నాకు పని నేర్పించిన సోషల్ మీడియాలోనే కస్టమర్లను వెతుక్కున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చక్కని చిత్రాలు’ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అందులో వాటిని పోస్ట్ చేయడం ప్రారంభించాను. నా మొదటి కస్టమర్ కూడా ఖమ్మంవాసే. వాళ్లకు మండల ఆర్ట్‌ను కలర్ఫుల్గా తయారు చేసివ్వడంతో తిరిగి రెండు నెలల తర్వాత మరో ఆర్డర్ ఇచ్చారు. 2024 చివర్లో ప్రారంభమైన నా ప్రయాణం వైజాగ్, హైదరాబాద్ నగరాలకు విస్తరించింది. ఈ కళను మా ఇంటిపక్కన ఉండే పావనికి కూడా నేర్పించాను. డిగ్రీ పూర్తిచేసిన తను నేను చేస్తున్న పనిని చూసి ‘నాక్కూడా నేర్పించక్కా’ అనడంతో కాదనలేకపోయాను. ప్రస్తుతం తను నాకు చేదోడువాదోడుగా ఉంటూ ఉపాధి పొందుతున్నది. వాస్తవానికి ఈ కళను నేను పుట్టిపెరిగిన ప్రాంతంలో పరిచయం చేయాలనుకున్నాను. కానీ, అక్కడ వర్కవుట్ కాకపోవడంతో మెట్రో నగరాలకు పరిచయం చేస్తున్నాను. గుజరాతీలు చేసినట్టు మట్టితో కాకుండా హార్డ్‌నర్ అండ్ క్లేతో వీటిని తయారు చేస్తున్నాను. అది రాక్ సాలీడ్‌గా మారగానే ఫెవికాల్తో అద్దాలను అతికిస్తూ ఫినిషింగ్ చేస్తున్నాను.

సొంత ఇళ్లు ఉన్నవాళ్లు గోడలపైనా, అద్దె ఇంట్లో ఉండేవారు ఎండీఎం బోర్డ్లపైనా ఈ డిజైన్లు చేసుకోవచ్చు. మాది హ్యాండ్‌మేడ్ కావడం వల్ల ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సంపాదించేదానికంటే మనసుకు నచ్చిన పనిచేస్తున్నానన్న తృప్తి ఉంది. ఆదాయం కూడా కాస్త కుడిగానే ఉంది. అన్ని రంగాల్లో ఉన్నట్లే ఇందులోనూ నిరాశలుంటాయి. ఒక్కోసారి కస్టమర్లు అన్నీ ఒకే చేసిన తర్వాత కూడా చివరి నిమిషంలో వద్దని చెబుతారు. అలాంటివన్నీ అనుభవాలుగా మలుచుకొని ముందుకు వెళుతున్నాను. నా మాడల్స్ చూయించేందుకు భవిష్యత్తులో ఓ స్టూడియో ఏర్పాటు చేయాలని ఉంది. ఈ కళలో కొంతమందికైనా ఉపాధి కల్పించాలన్నది నా ఆలోచన.